amma-jayalalithaa-dischargeతమిళులకు దీపావళి పర్వదినం ఎంత ప్రీతిపాత్రమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి దీపావళి ఈ ఏడాది మరో మూడు రోజులు ముందుగానే తమిళ ప్రజలను పలకరించబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిశ్చార్జ్ రూపంలో..! అవును… అపోలో హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఉన్న జయలలితను ఈ నెల 26 లేదా 27 తేదీలలో డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నట్లు అన్నాడీఎంకే వెల్లడించింది.

సదరు సమాచారంతో పార్టీ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. అసలు దీపావళి తమకు మూడు రోజులు ముందుగానే వచ్చిందంటూ సంబరాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు అమ్మ కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రత్యేక పూజలు నిర్వహించగా, తాజా సమాచారంతో ఆ పూజా సమయాలు కాస్త సంబరాల సమయాలుగా మారిపోయాయి. ప్రస్తుతం జయలలిత పూర్తి ఆరోగ్యం సంతరించుకున్నారని, ఫిజియోథెరపీ చికిత్స మాత్రమే కొనసాగుతోందని, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో వుంటే సరిపోతుందని వైద్యులు చెప్పినట్టు అన్నాడీఎంకే ప్రకటనలో పేర్కొంది.

అయితే ఇదే సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలు ఎందుకు వెల్లడించడం లేదు అనేది సామాన్య ప్రజానీకానికి అర్ధం కాని విషయం. నిజానికి పార్టీ పరమైన ప్రకటనలు కేవలం, కొంతవరకే పరిమితమవుతాయి. అదే సమాచారం ఆసుపత్రి వర్గాల నుండి అధికారికంగా వెల్లడిస్తే, అది ప్రజల నమ్మకాన్ని చూరగొంటుంది. ఇదిలా ఉంటే, లండన్‌ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలే సమక్షంలో అపోలో, ఎయిమ్స్, సింగపూర్ వైద్య నిఫుణుల బృందంలో అందించిన చికిత్స సఫలం కావడమనేది రాజకీయంగా తమిళనాట ఊపిరి పీల్చుకునే అంశం.