amma jayalalitha losing in tamilnadu election 2016తమిళనాడు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేడు పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే వచ్చే ఎన్నికలలో ఎవరూ విజయం సాధిస్తారో కూడా నేడే చెప్పేయవచ్చు. అంతలా తమిళ ప్రజల ఓటింగ్ ఉంటుందని గత చరిత్ర చెప్తోంది. అయితే ఈ సారి అలాంటి చరిత్రను తిరగరాయడానికి తమిళనాడు ‘అమ్మ’ సిద్ధమైందని అంతా ఊహించారు. కానీ, వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండడం తమిళనాడు రాజకీయాలను మరొకసారి గుర్తుకు తెస్తోంది.

చూడబోతుంటే… జయలలితకు మళ్లీ కష్టకాలం వచ్చినట్లే కనిపిస్తోంది. నేడు ముగిసిన ఎన్నికల్లో జయలలితకు ఓటర్లు షాక్ ఇచ్చారని న్యూస్ నేషన్ తెలిపింది. కరుణానిధి వైపు ఓటర్లు మొగ్గుచూపారని, డీఎంకేకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది. ‘న్యూస్ నేషన్’ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం… తమిళనాడులో అన్నా డీఎంకే 95 నుంచి 99 స్థానాలను గెలుచుకోబోతోందని తెలిపింది.

అయితే ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే 114 నుంచి 118 స్థానాల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోనుందని వెల్లడించింది. కెప్టెన్ విజయకాంత్ పార్టీ డీఎండీకే కేవలం 14 స్థానాలకే పరిమితం కానుందని ఈ సర్వే చెప్పగా, పీఎంకే ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. ఇతరులు 9 మంది గెలిచే అవకాశం ఉందని ‘న్యూస్ నేషన్’ వెల్లడించింది. ఈ ఒక్క సర్వేనే కాదు, విడుదలైన అన్ని సర్వేలు డీఎంకే పార్టీ వైపే మొగ్గు చూపాయి. దీంతో ఈ సర్వేల పట్ల ‘అమ్మ’ అభిమానులు నిరాశ చెందుతున్నారు.