ఓడలు బళ్లవుతాయి… బళ్ళు ఓడలు అవుతాయి అంటారు. దీనికి కచ్చితమైన ఉదాహరణ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ అనితరసాధ్యమైన నటన కనబరచినా ఒక వర్గం కేవలం క్లైమాక్స్ లో ప్రముఖంగా లేడు అనే కారణంగా ఆ సినిమాలో హీరో చరణ్, ఎన్టీఆర్ సైడ్ హీరో అంటూ ఒక వాదన తెర మీదకు తెచ్చారు.
ఎన్టీఆర్ అభిమానులు కూడా మల్టీస్టారర్ అనే విషయం మర్చిపోయి… ఎన్టీఆర్ కు రాజమౌళి ఇంకా ఏదో చేసెయ్యలేదు అనే నిరాశలో తెలీకుండానే ఆ వర్గానికి కొమ్ము కాశారు. ఆ రకంగా ఎన్టీఆర్ సైడ్ హీరో అనే వాదన మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది.
దేశం మెచ్చిన నటనకు ఇటువంటి యాంటీ-క్లైమాక్స్ రావడం నిజంగా శోచనీయమే. దానికి తోడు #ఎన్టీఆర్30 ఆలస్యం అవ్వడంతో ఒకరకమైన నైరాశ్యం ఆవహించింది.
అయితే గోడకు కొట్టిన బంతి లా ఎన్టీఆర్ తిరిగి వచ్చాడు. గత వారం రెండు వారాలుగా అంతర్జాతీయంగా ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతుంది. అంతర్జాతీయ పత్రికలు, క్రిటిక్స్ ఎన్టీఆర్ కు ఆస్కార్ రావాలని, వచ్చే అవకాశం బలంగా ఉందని చెబుతున్నారు.
దీనితో సైడ్ హీరో అన్న నోళ్లే ఈ రోజు ఎన్టీఆర్ కు ఆస్కార్ వస్తుందా అంటూ డిబేట్లు పెడుతున్నాయి.
అయితే ఎన్టీఆర్ డ్రీం రన్ అక్కడితో అయిపోలేదు. దేశంలో నే మోడీ తరువాత అంతటి పవర్ ఫుల్ నాయకుడైన అమిత్ షా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటనను మెచ్చి తనను కలవడానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ భేటీకి రామ్ చరణ్ ను గానీ, రాజమౌళి ని గానీ పిలవకపోవడం రాజకీయ కోణం కావొచ్చు. అయితే ఎన్టీఆర్ సైడ్ హీరో అంటూ వాగిన నోర్లకు మాత్రం మూతపడినట్టే.
సైడ్ హీరో హేళనల నుండి ఇక్కడి వరకు వచ్చిన ఎన్టీఆర్ ను శెభాష్ రా సమారా అనక తప్పదు.
ఇక ఆస్కార్ వచ్చినా… కనీసం ఆస్కార్ కు ఇండియా నుండి నామినేట్ అయినా సరే ఎన్టీఆర్ కు తిరుగు లేని స్టార్డమ్ వచ్చేసినట్టే.
తెలుగు సినిమాపై కాదు.. భారతీయ సినిమా ముఖచిత్రం పై ఎన్టీఆర్ సంతకం మొదలయినట్టే