amitabh bachchan about bofarce case his familyగతంలో తనకు, తన కుటుంబానికి జరిగిన చేదు అనుభవాలను ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ నెమరువేసుకున్నారు. ఈ మేరకు తన బ్లాగులో చేదు అనుభవాలను వివరించారు. “టెక్నాలజీ పెరిగిపోవడంతో, ఆరోపణలు చేయడం సులభమైపోయింది. ఏది వాస్తవం? ఏది అవాస్తవం? అన్నది తెలుసుకోవాలన్న కోరిక ప్రజల్లో ఉండడం లేదు. దీంతో వివాదాస్పద ఆరోపణలను మోసుకెళ్లే వాహనాలు అత్యంత వేగంగా పరుగులు తీస్తున్నాయని, ఎడారి ఇసుక తుపాను కంటే వేగంగా తీసుకెళ్లే కేబుళ్లు, శాటిలైట్లు వాటి పరిధిని మరింత పెంచుతున్నాయని” ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తీరును ఎండగట్టే ప్రయత్నం చేసారు.

25 ఏళ్ల క్రితం వెలుగు చూసిన “బోఫోర్స్” కుంభకోణంలో దేశంలోని ప్రతి చేయీ తన కుటుంబాన్ని వేలెత్తి చూపిందని, ఈ నరకం పాతికేళ్ల పాటు సాగిందని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా అంతా భోఫోర్స్ తోనే ముడిపెట్టి చూసేవారని, ఎన్నో ఆరోపణలు, ఇంకెన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని గతాన్ని స్మరించుకున్నారు.

బోఫోర్స్ కుంభకోణంలో అమితాబ్ కుటుంబానికి ఎలాంటి పాత్ర లేదని ఆ కేసును విచారించిన స్వీడిష్ కంపెనీలు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తమ కుటుంబాన్ని వదల్లేదని మదనపడ్డ అమితాబ్, ఆనాడు తమ కుటుంబం అనుభవించిన బాధను అప్పుడంటిన మరకలను ఎవరు తొలగించగలరని, చేదు పరిణామాలతో నరకం చూసిన తాము ఏవిధంగా స్పందిస్తామని ఆయన ప్రశ్నించారు.