Amit-Shah-JrNTR-Meetకేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణం అయ్యేముందు నోవాటెల్ హోటల్‌లో జూ.ఎన్టీఆర్‌తో భేటీ అవడంపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. “ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ అమిత్‌ షా ఇద్దరూ అవసరంలేకుండా ఎవరినీ ఊరికే కలవరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ.ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. కనుక ఆయనను బిజెపి ప్రచారానికి వాడుకోవాలని భావిస్తున్నట్లున్నారు. జూ.ఎన్టీఆర్‌ మద్దతుతో బిజెపిని బలపరుచుకోవాలనుకొంటున్నారేమో?” అని అన్నారు.

జూ.ఎన్టీఆర్‌తో అమిత్‌ షా భేటీ అవడం రెండు తెలుగు రాష్ట్రాలలో మీడియాలో అనేకరకాల విశ్లేషణలు వచ్చాయి. జూ.ఎన్టీఆర్‌ను బిజెపి తరపున ప్రచారం చేయాలని అమిత్‌ షా కోరి ఉండవచ్చని వాటి సారాంశం. కొడాలి నాని కూడా అదే ఊహించారు. ఒకవేళ జూ.ఎన్టీఆర్‌ ఇందుకు ఒప్పుకొంటే మొదట త్వరలో జరుగబోయే మునుగోడు ఉపఎన్నికలలో ప్రచారం చేయవలసిందిగా కోరవచ్చు.

కానీ బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమంటే కోరుండి తెలంగాణ సిఎం కేసీఆర్‌తో, టిఆర్ఎస్‌తో శతృత్వం తెచ్చుకొన్నట్లే. తెలుగు సినీ పరిశ్రమ, సినీ నటుల ఆస్తిపాస్తులు, వారి నివాసాలు, కార్యాలయాలు, ఖరీదైన వాహనాలు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కనుక కేసీఆర్‌తో శతృత్వానికి జూ.ఎన్టీఆర్‌తో సహా సినీ నటీనటులు ఎవరూ సాహసించరనే చెప్పవచ్చు.

కానీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో శతృత్వం కూడా చాలా ప్రమాదకరమైనదే. ఆయన కనుసైగ చేస్తే ఆదాయపన్ను, ఈడీలు దాడులు చేస్తాయి. కనుక ఒకవేళ అమిత్‌ షా బిజెపికి ప్రచారం చేయాలని కోరి ఉంటే 2024 శాసనసభ ఎన్నికలలో ఏపీలో ప్రచారం చేసేందుకు జూ.ఎన్టీఆర్‌ అంగీకరించి ఉండవచ్చు. అదే నిజమైతే వైసీపీకి అది చాలా పెద్ద కష్టమే!