Amit Shah -Narendra Modiకర్ణాటకలో తాము ఇన్ని స్థానాలలో విజయం సాధిస్తామని బహుశా బిజెపి కూడా ఊహించి ఉండకపోవచ్చు. అందుకనే రెట్టించిన ఉత్సాహంతో ఒక్కో బిజెపి నేత మితిమీరిన ప్రకటనలు చేస్తున్నారు. సంతోషం, బాధలలో ఉన్నపుడు ఇలాంటి ప్రకటనలు సర్వసాధారణం గనుక, వీటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదు గానీ, కర్ణాటకలో రాజకీయం రంజు మీద ఉందన్న విషయం తేటతెల్లం. ఇది కాంగ్రెస్ వ్యూహరచనకు, బిజెపి మాస్టర్ స్కెచ్ లకు సంబంధించిన ప్రతిష్టాత్మక అంశంగా మారింది.

దీనిపై స్పష్టత రావాలంటే మరో ఒకటి, రెండు రోజులు పడుతుంది. రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా సంభవిస్తుంది కాబట్టి, రాబోయే కొద్ది గంటలలో “ఏదైనా” జరగవచ్చు, ఫైనల్ గా 18వ తేదీన “ఎవరైనా” ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇదిలా ఉంటే, కర్ణాటకలో లభించిన సీట్లతో తమ ఫోకస్ ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలేనని బిజెపి నేతలు సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి సీనియర్ నేతలు అయితే 2019లో ఏపీలో అధికారం బిజెపిదేనని బల్లగుద్దీ మరీ చెప్తున్నారు.

మోడీ అండ్ అమిత్ షా మాస్టర్ స్కెచ్ లు ఎక్కడైనా పని చేస్తాయేమో గానీ, తెలుగు గడ్డ మీద కాదన్న విషయం మరో ఏడాది అయితే గానీ బిజెపి సభ్యులకు స్పష్టత రాదు. లోపాయికారీ ఒప్పందాలతో వైసీపీ, జనసేనల ద్వారా చంద్రబాబును అధికారానికి దూరం చేయాలన్న లక్ష్యం నెరవేరితే నేరవరవచ్చు గానీ, ఏపీలో గానీ, అటు తెలంగాణాలో గానీ అతి పెద్ద పార్టీగా మారాలన్న ఆకాంక్ష అయితే నెరవేరే అవకాశం లేదు. అతి పెద్ద పార్టీ కాదు కదా, కనీసం రెండు, మూడు స్థానాలను కూడా తెలుగు ప్రజలు బిజెపికి కట్టబెట్టరు.

కర్ణాటకలో బిజెపి ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, గతంలో యడ్యూరప్ప నేతృత్వంలో ఓ సారి పరిపాలన చేసింది. అయితే ఈ సారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది, అది కూడా వారి అంచనాలకు భిన్నంగా! అందుకే పట్టరాని ఆనందం అంతా! తెలుగు నాట కూడా ‘జీరో’ అనుకుని ప్రారంభిస్తే, ఒకటో, రెండో పొరపాటున వస్తే, అప్పుడు కూడా మిక్కిలి సంతోషించవచ్చు! అంతేగానీ ఏకంగా తెలుగు గడ్డపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే మాత్రం, కరెంట్ షాక్ కంటే దారుణమైన అనుభూతిని తెలుగు ప్రజలు మిగులుస్తారని గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు రుచిచూపించిన వైనం బిజెపి గుర్తు చేసుకోవాలి.