Amit Shah - Narendra - Modiఅయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్‌కు కేంద మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన లోక్‌సభలో చెప్పారు.

ప్రధాని లోక్‌సభలో ప్రకటన చేసిన కొద్దిసేపటికే ట్రస్ట్ విధివిధానాలపై అమిత్ షా వెల్లడించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ఏర్పాటయ్యే ఈ ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు ఉంటారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో దళితుల నుంచి ఒకరిని సభ్యుడిగా నియమిస్తామని స్పష్టం చేశారు.

ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ట్రస్టు సభ్యులే తీసుకునేలా స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఆలయం కోసం మొత్తం 67 ఎకరాల భూమిని దీనికి బదిలీచేస్తామని షా పేర్కొన్నారు. అదే ప్రకారంగా ముస్లింలకు సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి ఐదు ఎకరాల స్థలాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన తెలిపారు.

అయితే ఈ భూమి తీసుకోవాలా లేదా అనే దాని పై ముస్లిం సంస్థలలోనే భిన్న అభిప్రాయాలు ఉండటంతో ఏమవుతుందో చూడాలి. గతేడాది నవంబరు 9న వివాదాస్పద భూమిపై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు… ఆలయ నిర్మాణానికి మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటుచేయాలని ఆదేశించింది.