YS Jagan - Amit Shahఆంధ్రప్రదేశ్ లో ముబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కరోనా కేసుల మీద కేంద్రం దృష్టి సారించిందని సమాచారం. ఈ విషయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదివారం ఉదయం ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం. గత ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో యాభై కంటే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.

రెండు సార్లు అరవై కంటే ఎక్కువ, ఇంకో రెండు సార్లు ఎనభై కంటే ఎక్కువగా కేసులు నమోదు అయ్యాయి. దీనితో అమిత్ షా ఏం జరుగుతుందని జగన్ ని అడిగినట్టు సమాచారం. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదని, రాష్ట్రంలో విస్తృతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారట. అలాగే ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు.

లాక్ డౌన్ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై వారిరువురు చర్చించారు. ఈనెల 20 తర్వాత ఇచ్చిన సడలింపుల ప్రభావంపైనా సీఎంతో అమిత్ షా చర్చించారు. తొందరలో ప్రధాని సీఎంల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మే 3 తరువాత ఏం చెయ్యాలి అనేదాని మీద డిస్కస్ చేస్తారని అమిత్ షా సీఎంకు తెలిపారట.

ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1097 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 81 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 52 కేసులు కృష్ణ జిల్లాకు చెందినవి, మరో 12 కేసులు పశ్చిమ గోదావరికి చెందినవి. 279 కేసులతో కర్నూలు, 214 కేసులతో గుంటూరు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 177 కేసులతో కృష్ణా జిల్లాలో కూడా ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుంది.