Ambati-Rambabuఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ, ప్రభుత్వం ప్రతిపక్షం ఉండకూడదనే కోరుకొంటాయి. ఒకవేళ ఉన్నా అవి ప్రేక్షకపాత్రకే పరిమితం కావాలని కోరుకొంటాయి. తాము చేస్తున్నదే పాలన… చెప్పిందే వేదం అని అందరూ భావించాలని కోరుకొంటాయి. మన ప్రజాస్వామ్య విధానంలో ఇవి సాధ్యం కావని తెలిసి ఉన్నా కోరుకొంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్య ముసుగులో వ్యక్తిపూజకు, రాజరికపు పోకడలకు అలవాటు పడినందున!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎడాపెడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నా, అనాలోచిత నిర్ణయాలతో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించేస్తున్నా తమ వంటి ఉత్తమ ప్రభుత్వం దేశంలోనే లేదని సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీలో అందరూ బల్లగుద్ది వాదిస్తుంటారు. కానీ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని ప్రతిపక్షాలు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నా ఆ విషయం గురించి మాట్లాడరు.

ముఖ్యమంత్రి కంటే ముందు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముంపు ప్రాంతాలలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తే, వైసీపీ నాయకులకు కోపం వచ్చేస్తుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, “వరద బాధితులకు మా ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేసినందుకు వారు చాలా సంతృప్తి చెందారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వరద బాధితుల వద్దకు వెళ్ళి వారికి ధైర్యం చెప్పివచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు పరామర్శ పేరుతో వరద బాధితులను, ప్రజలను రెచ్చగొడుతూ బురద రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా శేష జీవితమంతా రోడ్లపై తిరగాల్సిందే తప్ప ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరు,” అని అన్నారు.

ఇదివరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు, మంత్రి అంబటి రాంబాబుతో సహా వైసీపీ నేతలు “హైదరాబాద్‌లో కూర్చొని రాజకీయాలు చేయడం కాదు దమ్ముంటే ఏపీకి వచ్చి మాట్లాడు,” అంటూ సవాళ్ళు విసిరారు. చంద్రబాబు నాయుడు విజయవాడలో అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వచ్చినపుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్య చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ‘శవ రాజకీయాలు’ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు వరద బాధితులను పరామర్శిస్తే ‘బురద రాజకీయాలు’ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉన్నా, ఏపీలో పర్యటించినా వైసీపీకి ఆమోదయోగ్యం కాదని, ఆయన తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి ఈవిదంగా ఏదో ఓ పేరు తగిలించి తిప్పికొడితే సరిపోతుందని భావిస్తున్నట్లుంది. అయితే అంబటి రాంబాబు తమ ప్రభుత్వ పాలనపై ప్రజలేమనుకొంటున్నారో ప్రజల మద్యకు వెళ్ళి తెలుసుకొంటే మంచిది.