Ambati_Rambabu_MLA_Roja_Selvamaniటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు ప్రతీరోజూ మంత్రులు మరో పనేదీ లేన్నట్లు ఆయన గురించి, ఆయన చేస్తున్న యువగళం పాదయాత్ర గురించి అవహేళనగా మాట్లాడుతున్నారు. నలుగురు మంత్రులు, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతీరోజూ ఇదే పనిమీదుంటున్నారు. ఇక వైసీపీ ఆత్మసాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియా ‘యువగళం యాత్రని’ నెగెటివ్ యాంగిల్లో బాగానే కవర్ చేస్తూనే ఉన్నాయి.

పాదయాత్ర వలన నారా లోకేష్‌కి కాళ్ళ నొప్పులు తప్ప ఆయనకి, టిడిపికి ఒరిగేదేమీలేదని మంత్రులు అంబటి రాంబాబు, ఆర్‌కె.రోజా ఎద్దేవా చేస్తున్నారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌ వారాహిలో తిరిగినా, టిడిపితో పొత్తులు పెట్టుకొన్నా తమకేమీ అభ్యంతరం లేదని వాదిస్తున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకొంటున్నా వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 సీట్లు గెలుచుకోవడం ఖాయమని వాదిస్తున్నారు.

ఇక సిఎం జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో తోడేళ్ళన్నీ గుంపుగా యుద్ధానికి వస్తుంటే తాను ఒక్కడినే సింహంలా సింగిల్‌గా వాటితో పోరాడబోతున్నానని గర్వంగా చెప్పుకొన్నారు. టిడిపి, జనసేనలు కలిసి వచ్చినా తమని పీకలేవని గట్టిగా చెపుతుంటారు.

మరి అటువంటప్పుడు టిడిపి-జనసేనల పొత్తుల గురించి, నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర గురించి నిత్యం ఎందుకు మాట్లాడుతున్నారు?అనే సందేహం కలుగుతుంది. వైసీపీకి నిజంగానే 175 సీట్లు గెలుచుకోగలమనే నమ్మకమే ఉన్నట్లయితే టిడిపి, జనసేనల పొత్తుల గురించి పట్టించుకొనేదే కాదు. అలాగే నారా లోకేష్‌ పాదయాత్ర, పవన్‌ కళ్యాణ్‌ వారాహి వాహనాలను అసలు పట్టించుకొనేదే కాదు.

తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర వలన వచ్చే నష్టం ఏమీ లేదని భావిస్తున్న సిఎం కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీలు ఆమెని ఏవిదంగా పట్టించుకోకుండా ఊరుకొంటున్నారో అదేవిదంగా ఏపీలో టిడిపి-జనసేనల పొత్తులని, నారా లోకేష్‌ పాదయాత్రని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండాలి. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ నిత్యం వారినే స్మరిస్తున్నారంటే అర్దం ఏమిటి? గెలిచేవారు ఓడిపోతున్నవారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి?రాబోయే ఎన్నికలలో వారి వలన తమ పార్టీ నష్టపోతుందనే భయం, వారి చేతుల్లో ఓడిపోతామనే భయమే కారణంగా కదా?