ambati rambabu polavaramపోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ 2022, ఏప్రిల్ నెలలోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం గడువు విధించగా, గత టిడిపి ప్రభుత్వం చేసిన సాంకేతిక తప్పిదాల వలన డయాఫ్రం వాల్వ్ దెబ్బ తిందని కనుక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని, అవి ఎప్పుడు పూర్తవుతాయో కూడా చెప్పలేమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేశారు.

టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఇదే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ప్రశ్నించగా, ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పోలవరానికి కేటాయించిన నిధులను వాడుకోవడంలో ఏపీ ప్రభుత్వం అలసత్వం, గుత్తేదారు కంపెనీ నామమాత్రంగా నిర్మాణ పనులు చేస్తుండటం, పనుల విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడం, గుత్తేదారు కంపెనీకి, అధికారులకి మద్యన సమన్వయం కొరవడటం, కరోనా తదితర కారణాల వలన సకాలంలో పనులు పూర్తవలేదని తెలియజేశారు.

దీనిపై మాజీజలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ట్వీటర్‌లో స్పందిస్తూ, “పోలవరం పట్ల ఏపీ ప్రభుత్వ అసమర్ధతను నిర్ధారించిన కేంద్రం. నిర్మాణ, నిర్వహణలో వైఫల్యం..సరైన ప్రణాళిక లేకపోవడమే జాప్యానికి కారణమని..పార్లమెంటులో చెప్పిన కేంద్రజలశక్తి శాఖ. ఆంధ్రుల జీవనాడి పోలవరంప్రాజెక్టు నేటి దుస్థితికి కారణమైన జగన్ రెడ్డీ జాతికిచేసిన ద్రోహానికి రైతులకు ఏంసమాధానంచెప్తారు?” అని నిలదీశారు.

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో గత ప్రభుత్వ హయాంలో సాంకేతిక తప్పిదాలు జరిగాయని, ఆ కారణంగానే డయాఫ్రం వాల్వ్ దెబ్బ తిని పోలవరం నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని ఎక్కడా పేర్కొనలేదు. జగన్ ప్రభుత్వం అసమర్దత, వైఫల్యాల కారణంగానే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదని స్పష్టం చేసింది. మరిప్పుడు డయాఫ్రం మంత్రి అంబటి రాంబాబుగారు ఏమి చెపుతారో చూడాలి.