Ambati Rambabuపోలవరం ప్రాజెక్టుకు పూర్తిచేయలేక సాకులు వెతుకుతున్న జగన్ సర్కార్, డయాఫ్రం వాల్ రిపేర్ పేరుతో చేతులెత్తేసింది. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుదవారం ఉదయం ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద గోదావరి నీటిని విడుదల చేశారు.

తరువాత అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతున్నాయి. కనుక ఈ ప్రాజెక్టు ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేము. మొదటి దశ పనులు పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము.

గత ప్రభుత్వ హయంలో ముందుగా కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం ఓ చారిత్రిక తప్పిదం. దాని వలన డయాఫ్రం వాల్ దెబ్బ తింది. కనుక ఇప్పుడు డయాఫ్రం వాల్‌కి మరమత్తులు చేయాలా లేదా మళ్ళీ కొత్తగా నిర్మించాలో తెలియక దేశంలో మేధావులు తలలు పట్టుకొంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమ తప్పుడు నిర్ణయాల కారణంగానే డయాఫ్రం వాల్‌ దెబ్బ తింది. వారికి దమ్ముంటే డయాఫ్రం వాల్‌ ఎందుకు దెబ్బ తిందనే అంశంపై బహిరంగ చర్చకు రావాలి,” అని సవాల్ విసిరారు.

ఆయన మంత్రిగా చేపట్టిన తొలిరోజు మీడియాతో మాట్లాడుతూ, “శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర, బాక్రానంగల్ డ్యామ్‌లలో డయాఫ్రం వాల్ ఇన్నేళ్ళు గడిచినా దెబ్బ తినలేదు. కానీ పోలవరంలోనే ఎందుకు దెబ్బ తింది?” అంటూ తొలిరోజునే చంద్రబాబు నాయుడుని విమర్శించబోయారు.

అయితే ఆయన చెప్పిన ఆ ప్రాజెక్టులలో డయాఫ్రం వాల్ లేదని విలేఖరి చెప్పేసరికి అంబటి తడబడ్డారు. కానీ ఉన్నాయని గట్టిగా బుకాయించబోయారు. కానీ మళ్ళీ విలేఖరులు లేవని గట్టిగా నొక్కి చెప్పడంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి అంబటి పక్కనే ఉన్న తన కార్యదర్శిని కనుకొన్నారు.

ఆయన కూడా ఆ ప్రాజెక్టులకు డయాఫ్రం వాల్స్ లేవని చెప్పడంతో అంబటి సర్ధుకొని “ఇవన్నీ సాంకేతిక అంశాలు. వీటి గురించి తెలిసి ఉండటానికి నేనేమీ ఇంజనీరునో కాంట్రాక్టరునో కాను. నా శాఖ గురించి జస్ట్ మీడియాకు వివరిస్తున్నాను అంతే. త్వరలో ప్రాజెక్టులు పర్యటించి అన్ని వివరాలు తెలుసుకొంటాను,” అని అన్నారు.

డయాఫ్రం వాల్ గురించి తెలియకుండానే తొలి మీడియా సమావేశంలో నోటికి వచ్చినది మాట్లాడేసి నవ్వులపాలయ్యారు. అప్పటి నుంచి డయాఫ్రం వాల్‌ని తన ఇంటిపేరుగా చేసుకొని, ఎప్పుడు ఎక్కడ మీడియాతో మాట్లాడినా దాని గురించే మాట్లాడుతున్నారు.

అయితే దీనిపై కూడా టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఘాటుగానే స్పందించారు. “మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళయింది. డయాఫ్రం వాల్ పాడైతే దానికి మరమత్తులు చేయించాలి కానీ మూడేళ్ళుగా ఏమి పీకుతున్నారు?పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం చేతకాక ఈవిదంగా మమ్మల్ని నిందిస్తూ ఇంకా ఎన్నేళ్ళు కాలక్షేపం చేస్తారు?” అని నిలదీశారు. దానికి ఇంతవరకు మంత్రి అంబటి సమాధానం ఇవ్వనేలేదు. కానీ పోలవరం పూర్తి చేయడం తమ వల్లకాదనే అసలు విషయం మాత్రం చెప్పేశారు.