Ambati Rambabuఅధికారం చేపట్టిన వెంటనే ఒక్క రాజధాని కాదు, మూడు రాజధానుల నిర్మాణమే మా ప్రభుత్వ లక్ష్యం, అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమవుతుందని ప్రకటనలు చేసిన జగన్ సర్కార్, ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలను చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కోర్టులో ఎదురుదెబ్బ తగలనున్న నేపధ్యంలో, చివరి నిముషంలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుని పరువు దక్కించుకున్న వైసీపీ ప్రభుత్వం, మళ్ళీ అదే అమరావతిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్ల అప్పుకు తెరలేపింది. అధికారం వచ్చిన తర్వాత రెండున్నర్రేళ్ళ సమయంలో చేసిన పనులివి.

ప్రస్తుతానికి వస్తే 13 జిల్లాలు కాదు, ఏకంగా వాటిని డబుల్ చేస్తూ… చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యం, అనే కొత్త స్లోగన్ ను వైసీపీ వర్గం అందుకుంది. ఒక్క రాజధాని కాదు, మూడు రాజధానులు అన్న తరహాలోనే 13 జిల్లాలు కాదు, 26 జిల్లాలంటూ “అభివృద్ధి” ప్రస్తావన మళ్ళీ తెరపైకి తీసుకువస్తోంది.

కనీసం ఈ జిల్లాల విభజన అయినా సరిగా చేసిందా? అంటే దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఏదొక వివాదం రాజుకుంటూనే ఉంది. అన్నమయ్య జిల్లాగా రాయచోటిని ప్రకటించడంపై సొంత పార్టీ నేతలే ఎదురు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇలా ఒకటి కాదు, దాదాపుగా అన్ని జిల్లాల పరిస్థితి ఇదే.

రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది ఓ విషయమైతే, ఇప్పుడు ఎవరిది ఏ జిల్లానో తెలియకుండా పోయిందంటూ సోషల్ మీడియాలో పడుతోన్న సైటర్లకు కొదవలేదు. పాలనలో సగం కాలం పైనే పూర్తయ్యింది. ‘టైటిల్ కార్డు’లో రాజధాని, ‘ఇంటర్వెల్’లో జిల్లాల ఊసెత్తిన వైసీపీ సర్కార్ ‘క్లైమాక్స్’లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందోనని వేచిచూడడం రాష్ట్ర ప్రజల వంతవుతోంది.