Ambati Rambabu Kapu Communityమంత్రి అంబటి రాంబాబు తాను చాలా తెలివిగా, మంచి హాస్య చతురతతో మాట్లాడుతుంటానని గట్టిగా నమ్ముతుంటారు. అయితే దానిని ‘వాచాలత’ అంటారని, అదే ఆయనని ప్రజలలో మరింత చులకన చేస్తోందని గ్రహించడం లేదు. రాష్ట్రంలో కాపులను ఉద్దేశ్యించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పల్నాడు జిల్లా, చాగంటివారిపాలెంలో ఆయన వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాపులు మా పవన్‌… మా పవన్ అంటూ ఒకటే గోకేసుకొంటున్నారు. అలా గోక్కొని గోక్కొని చివరికి కాపులందరూ చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయాల్సివస్తుందని గ్రహిస్తునట్లు లేదు. పవన్‌ కళ్యాణ్‌కి నేటికీ రాజకీయాలు వంటపట్టలేదు. అందుకే రోజుకో పార్టీ వెంట తిరుగుతుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెంట తిరుగుతూ ఆయన చెప్పిన్నట్లు ఆడుతున్నాడు. ఆయన సూచన మేరకే రాష్ట్రంలో కాపులని ఆకట్టుకొని అందరినీ తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు దొడ్లో కట్టేయలని ప్రయత్నిస్తున్నాడు. కనుక కాపులు చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ కావాలో లేదా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే నేను కావాలో తేల్చుకోవాలి. వైసీపీలో మిగిలిన అందరికంటే నేనే ఎక్కువగా టిడిపి, జనసేనలని టార్గెట్ చేసి విమర్శిస్తుంటాను. అందుకే సత్తెనపల్లి ఓ మహిళని నేను రూ.2.50 లక్షలు లంచం అడిగానని జనసేన నేతలు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ తలక్రిందులుగా తపస్సు చేసినా నన్ను పీకలేరు,” అని అన్నారు.

అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవారైనంత మాత్రాన్న ఆయన కాపులకి చేసిందేమీ లేదు. వైసీపీ కాపులకు కూడా మంత్రి పదవులు ఇచ్చి గౌరవిస్తోందని చెప్పుకోవడానికి తప్ప వారి వలన రాష్ట్రానికి, కనీసం కాపులకి ఒరిగేందేమీ లేదనే చెప్పాలి. వైసీపీలో ఇటువంటి కొందరు మంత్రులు ఎంతసేపూ తమ కార్యాలయంలో కూర్చొని సాక్షి మీడియాని ఎదుట పెట్టుకొని చంద్రబాబు నాయుడుని, పవన్‌ కళ్యాణ్‌ని తిట్టిపోయడం మినహా ఏం చేశారో చెప్పగలరా?మంత్రి హోదాలో ఉన్న అంబటి రాంబాబు వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో సమావేశమైనప్పుడు కనీసం వారి సమస్యల గురించి అడిగి తెలుకొనే ప్రయత్నం చేయకుండా పవన్‌ కళ్యాణ్‌ని తిట్టిపోయడానికే పరిమితమయ్యారు. ఈ మాత్రం కూడా చేయలేని మంత్రి అంబటి రాంబాబు తాను కాపు సామాజికవర్గానికి చెందినవాడిని కాబట్టి కాపులందరూ మరో ఆలోచన చేయకుండా తన వెంట నడవాలని చెపుతున్నారు. ఎందుకు నడవాలో కూడా చెపితే బాగుండేది కదా?