Ambati_Rambabu_Danceజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఏ ఉద్దేశ్యంతో మంత్రి అంబటి రాంబాబుని సంబరాల రాంబాబు అన్నారో కానీ ఆయన ఆ పేరుని సార్ధకం చేసుకొన్నారు. ఏటా సంక్రాంతి పండుగకి తన సత్తెనపల్లి నియోజకవర్గం లక్కీ డ్రాలు నిర్వహిస్తూ, స్థానిక ప్రజలతో ఆడిపాడుతుంటారు. ఈసారి కూడా సంక్రాంతి పండుగకి సంబరాల రాంబాబు గిరిజన మహిళలతో కలిసి ఆడిపాడారు. అయితే ఆయన చేసిన డ్యాన్స్ ముందు ఆ గిరిజన మహిళల డ్యాన్స్ ఎందుకు పనికిరాదనే చెప్పాలి.

సంబరాల రాంబాబు జీన్ ఫ్యాంట్, టీ షర్ట్, మంచి షూస్ వేసుకొని డ్యాన్స్ చేస్తుంటే రెండు కళ్ళూ సరిపోవనిపిస్తుంది. ఈరోజు భోగీ సందర్భంగా ఆయన గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తుంటే స్థానిక ప్రజలు తమ మంత్రిగారి డ్యాన్స్ ప్రావీణ్యం చూసి మురిసిపోయారు. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకి తీసిపోని విదంగా సంబరాల రాంబాబు డ్యాన్స్ చేశారు. ఆయన ఇలాగే రోడ్ల మీద డ్యాన్సులు చేస్తూ అదరగొట్టేస్తుంటే వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు కలక్షన్స్‌ పడిపోతాయని చిరంజీవి, బాలయ్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇక్కడ సత్తెనపల్లి మంత్రి రాంబాబు డ్యాన్స్ చేస్తుంటే, అక్కడ తిరుపతి జిల్లాలో మరో మంత్రి రోజా కూడా అవకాశం దొరికితే చాలు డ్యాన్సులు చేస్తూ ప్రజలని రంజింపజేస్తుంటారు. బహుశః అందుకేనేమో సిఎం జగన్మోహన్ రెడ్డి తన పాలనలో కష్టాలు అనుభవిస్తున్న ప్రజలని రంజింపజేసేందుకే ఇటువంటివారిని మంత్రులుగా తీసుకొన్నారని పవన్‌ కళ్యాణ్‌ అన్నారేమో?