YSRCP-Ambati-Rambabuవైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అనేక వ్యాపారాలు, కాంట్రాక్టులు ఉన్నాయని వాటి ద్వారా వారికి భారీగా ఆదాయం సమకూరుతుంటుంది. అవిగాక ఇసుక, మద్యం తదితర దందాలలో భారీగా కమీషన్లు ముడుతుంటాయనేది బహిరంగ రహస్యమే. అయితే చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంలో కమీషన్లు బొక్కుతున్నారంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తురక గంగమ్మ, పర్లయ్య దంపతులు మీడియా సమక్షంలో బయటపెట్టారు.

వారు సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “మాది గుంటూరు జిల్లాలోని దాసరిపాలెం. బ్రతుకుతెరువు కోసం సుమారు ఏడాది క్రితం సత్తెనపల్లి వచ్చాము. మాకు అనిల్ (17), సమ్మక్క (14) అనే ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 20వ తేదీ రాత్రి కొండలరావు అనే వ్యక్తికి చెందిన హోటల్‌ వినాయక్‌లో డ్రైనేజి గుంత పూడుకుపోతే ఆయన మా అబ్బాయి అనిల్‌ని ఆ పనికి పిలిచారు. మా అబ్బాయి ఆ డ్రైనేజి గుంతలో వ్యర్ధాలను బయటకి తీస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు దానిలో మునిగి చనిపోయాడు.

మా కొడుకు చనిపోయినందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రభుత్వం రూ.5 లక్షలు ఆర్ధికసాయం ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం స్థానిక మునిసిపల్ ఛైర్ పర్సన్‌ భర్త చల్లంచర్ల సాంబశివరావు మాకు ఫోన్‌ చేసి ఆ సొమ్ము వచ్చింది తీసుకోమని చెప్పారు. మేము ఆ సొమ్ముతో కూతురు పెళ్ళి చేసేయవచ్చని అనుకొన్నాము. కానీ దానిలో సగం తనకి ఇచ్చేయాలని ఆయన అన్నారు. దానిలో మంత్రి అంబటి రాంబాబుకి కూడా వాటా చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

అప్పుడు మేము నేరుగా అంబటి రాంబాబు వద్దకే వెళ్ళాము. ఆయన కూడా “అవును ఇవ్వాల్సిందే…” అంటూ మాపై కోపంగా అరిచి బయటకి పంపించేశారు.ఆ తర్వాత సీఐ వచ్చి మాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మేము ఒప్పుకోకపోవడంతో వైసీపీ నేతలు మమ్మల్ని బెదిరించడం మొదలుపెటారు. వారి వేధింపులు భరించలేక మేమిద్దరం పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నాం. కానీ మేము చనిపోతే మా కూతురు అనాధ అయిపోతుందని, అప్పుడు ఆమె జీవితం ఇంకా నరకం అవుతుందని ఆలోచించి ఆగిపోయాము.

నేటికీ ప్రభుత్వం ప్రకటించిన ఆ సొమ్ము మాకు ఇవ్వలేదు. మంత్రి అంబటి రాంబాబుకి, మునిసిపల్ ఛైర్ పర్సన్‌ భర్త చల్లంచర్ల సాంబశివరావు కలిపి రూ.2.50 లక్షలు ఇచ్చేందుకు అంగీకరిస్తేనే ఆ చెక్ మాకు ఇస్తామని లేకుంటే వెనక్కి తిప్పి పంపేస్తామని బెరిస్తున్నారు,” అని చెప్పారు.

ఇటీవల మంత్రి అంబటి రాంబాబు కమీషన్ల బాగోతాన్ని వారు బయటపెట్టడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాని గురింకీ మీడియాలో వార్తలు కూడా వచ్చేశాయి. వాటిపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలోనే తీవ్రంగా స్పందిస్తూ, “నేను ఆ సొమ్ములో కమీషన్‌ అడిగానని జనసేన నిరూపిస్తే నేను నా మంత్రి, ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేస్తాను,” అని సవాల్ విసిరారు.

ప్రభుత్వం చెక్కు విడుదల చేసి చాలా రోజులవుతున్నప్పటికీ నేటికీ తురక గంగమ్మ, పర్లయ్య దంపతులకు ఆ చెక్ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నిస్తే వారు కమీషన్‌ చెల్లించడానికి అంగీకరించడం లేదు కనుకనే అనే సమాధానం వస్తుంది. అంటే మంత్రి అంబటి రాంబాబు గురించి వారు చెప్పింది నిజమే అనుకోవలసివస్తుంది కదా?