Ambati Rambabu comments on three capitals‘కిందపడ్డా మాదే పైచేయి..’ అని చెప్పుకొనే అలవాటు వైసీపీ నేతలకి పుట్టుకతో వచ్చిన విద్య అని మంత్రి అంబటి రాంబాబు మరోసారి నిరూపించారు.

మూడు రాజధానుల వ్యవహారంపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కాలపరిమితికి సంబందించిన అంశాలపై మాత్రమే స్టే విధించింది. మూడు రాజధానుల ఏర్పాటుకి చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన్నట్లు భావించవచ్చు. కానీ ఇవ్వలేదు కనుక హైకోర్టు జారీ చేసిన స్టే నేటికీ అమలులో ఉన్నట్లే లెక్క.

కానీ మంత్రి అంబటి రాంబాబు సుప్రీంకోర్టు తీర్పుని కాకుండా విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను మాత్రమే తీసుకొని వాటిని తమ ప్రభుత్వానికి అనుకూలంగా అన్వయించుకొని మీడియా ముందు తన మిడిమిడి జ్ఞానం అంతా ప్రదర్శించారు. “రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమే తప్ప హైకోర్టు కాదని, కనుక ఈ విషయంలో హైకోర్టు జోక్యం సరికాదని “సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి” అర్దం అవుతోంది. న్యాయస్థానాల పని న్యాయస్థానాలు చేసుకోవాలి. ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకోవాలని స్పష్టమైంది. కనుక ఇకనైనా చంద్రబాబు నాయుడు మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు మానుకొంటే మంచిది. ఇక ఆయనకు వంతపాడుతున్న పవన్‌ కళ్యాణ్‌ సినిమాలలో హీరో… బయట పెద్ద జీరో! ఇప్పటికైనా జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఆయన చెప్పగలరా?” అని మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

మంత్రి అంబటి రాంబాబు స్వయంగా “సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి” అని చెపుతున్నారు. అంటే అది సుప్రీంకోర్టు అభిప్రాయమే తప్ప తీర్పు కాదూ… ఉత్తర్వులు కావని స్పష్టం అవుతోంది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. సందేహాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. అయితే అంతిమంగా వారిచ్చే తీర్పుకే సాధికారత ఉంటుంది తప్ప విచారణ సందర్భంగా చేసిన వారి వ్యాఖ్యలకి కాదు.

కానీ వాటిని పట్టుకొని మంత్రి అంబటి రాంబాబు అదే తీర్పు అన్నట్లు మాట్లాడేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్పుకొంటున్నప్పుడు తక్షణం శాసనసభని సమావేశపరిచి మూడు రాజధానుల బిల్లు పెట్టి ఆమోదించేసి మూడు రాజధానులు ఏర్పాటు చేసేయొచ్చు కదా?అప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఏవిదంగా అడ్డుకోగలరు?ఒకవేళ అడ్డుకొన్నా ఆగిపోవడం ఎందుకు?అయినా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ వద్దన్నవన్నీ వైసీపీ ప్రభుత్వం చేయడం మానుకోలేదు కదా?

ఇక పవన్‌ కళ్యాణ్‌ బయట ‘పెద్ద జీరో’ అని చెపుతున్నప్పుడు పదేపదే ‘ఆయన ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో, టిడిపితో పొత్తులు పెట్టుకొంటారో లేదో అని అడగటం దేనికి?అంటే భయం వల్లనే కదా?

ఏది ఏమైనప్పటికీ 2024 ఎన్నికలలో జరుగబోయేది తప్పకుండా జరుగుతుంది. దానిని ఎవరూ ఆపలేరు. కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం హుందాగా మాట్లాడటం అలవాటు చేసుకొంటే మంచిది.