ambati rambabu comments on pawan kalyanజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన నిన్న సాక్షి మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్‌ పొత్తులపై మూడు ఆప్షన్స్ ఇవ్వడం చూస్తే ఆయనకు ఈవిషయంలో ఇంకా క్లారిటీ లేదని అర్ధం అవుతోంది. బిజెపితో కొనసాగుతున్నామని చెపుతూనే టిడిపితో పొత్తులకు సిద్దం అని చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంతకీ ఆయన ఆశయం చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమేనా?కనీసం తన పార్టీ కార్యకర్తలకైనా స్పష్టం చేస్తే బాగుండేది,” అని అన్నారు.

జనసేన పొత్తులు ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ప్రస్తుతం బిజెపితో కలిసి నడుస్తోంది కనుక పవన్ కళ్యాణ్‌ ‘మూడు ఆప్షన్స్‌’పై బిజెపి నేతలు స్పందించారంటే అర్దం ఉంది. కానీ మద్యలో వైసీపీకి ఎందుకు ఇంత అసహనం?అసలు జనసేన, బిజెపి, టిడిపిలు దేనితో ఏది పొత్తులు పెట్టుకొంటే వైసీపీకి ఎందుకు?అంటే వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రాలేమనే అభద్రతాభావమే కారణంగా కనిపిస్తోంది.

నిజానికి మొన్న పవన్ కళ్యాణ్‌ చెప్పిన రెండో ఆప్షన్‌లో ఈసారి టిడిపియే తగ్గాలని స్పష్టంగా చెప్పారు. అంటే ఈసారి జనసేన కోరుకొనన్ని సీట్లు ఇవ్వాలని సూచిస్తున్నట్లు అర్ధమవుతోంది. కొందరు విశ్లేషకులు ఈసారి ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌ టిడిపికి సూచిస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. కానీ మంత్రి అంబటి రాంబాబు అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ కళ్యాణ్‌ తహతహలాడుతున్నారని భాష్యం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

వచ్చే ఎన్నికలలో మేమే తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలందరూ ధీమా వ్యక్తం చేస్తూ మళ్ళీ జనసేన-బిజెపి-టిడిపిల పొత్తుల గురించి ఈవిదంగా అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తుండటం చూస్తే వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అర్దమవుతోంది. అంటే వైసీపీ భవిష్యత్‌ వారికి ముందే అర్ధం అయిందన్న మాట.. గ్రేట్!