Ambati_Rambabu_YSRCP_Ministerమాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి ఈ ఈ నెల 23వ తేదీన ఉపఎన్నిక జరుగబోతోంది. శాసనసభ్యుడు చనిపోయినప్పుడు అతను లేదా ఆమె కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నయితే, వారిపై తమ అభ్యర్ధిని పోటీ పెట్టకూడదనే ఆనవాయితీ ప్రకారం ఈ ఉపఎన్నికకు టిడిపి దూరంగా ఉండిపోయింది. వైసీపీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డితో సహా మొత్తం 15 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేయగా వాటిలో వైసీపీ, బిజెపి, రిపబ్లికన్ పార్టీల అభ్యర్ధులు తప్ప మిగిలినవారి నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. దీంతో పోటీ ప్రధానంగా వైసీపీ, బిజెపిల మద్యకు మారింది. దీంతో బిజెపి నేతలు వైసీపీకి సవాళ్ళు విసురుతుండటంతో, ఉపఎన్నికలో ప్రచారానికి వెళ్ళిన ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బిజెపి గాలి తీసేస్తున్నట్లు మాట్లాడారు.

మంత్రి అంబటి రాంబాబు జిల్లాలో అనంతసాగరంలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఉపఎన్నికల బరిలో టిడిపి లేదు కనుకనే బిజెపి కనిపిస్తోంది. ఒకవేళ టిడిపి ఉన్నట్లయితే బిజెపి ఎక్కడా కనబడి ఉండేదే కాదు. అసలు బిజెపి ఎంత? దాని ఓటు బ్యాంక్ ఎంత?

బిజెపి జాతీయస్థాయి పార్టీ అయ్యుండవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉండి ఉండవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం అది ఓ పెద్ద జీరో మాత్రమే. అయినప్పటికీ బిజెపి నేతలకు ప్రగల్భాలు పలకడం, వాపును చూసి బలుపు అనుకోవడం పరిపాటిగా మారిపోయింది.

మంత్రినైనా నన్ను విమర్శిస్తే వారికి గుర్తింపు లభిస్తుందని ఆరాటపడుతున్నారు. అయితే వారికి ఏపీలో కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఈ ఉపఎన్నికలో మా వైసీపీ అభ్యర్ధి గెలవటమే కాదు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకొనేందుకు మేమందరం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాము,” అని అన్నారు.

మంత్రి అంబటి రాంబాబుతో సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో టిడిపి పని అయిపోయిందన్నట్లు మాట్లాడుతుంటారు. కానీ ఆత్మకూరులో టిడిపి పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని మంత్రి అంబటి రాంబాబు స్వయంగా చెప్పడం గమనిస్తే, వారు ఒప్పుకొన్నా బయటకు చెప్పుకోకున్నా టిడిపి తమ ప్రధాన ప్రత్యర్ధి అని అంగీకరించినట్లే అయ్యింది.