Ambati Rambabu comments on Amaravati Farmers mahapadayatra“అన్నాను… అంటాను… మళ్ళీ మళ్ళీ అంటాను… అది ఒళ్ళు బలిసినోళ్ళ పాదయాత్ర!” ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల మహాపాదయాత్ర గురించి మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. రైతులను, వారి త్యాగాలను గుర్తించలేకపోయినా పర్వాలేదు కానీ అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుతూ మహిళలు, వృద్ధులు ఎంతో ప్రయాసపడుతూ పాదయాత్ర చేస్తుంటే వారు ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తున్నారని ఓ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం.

పైగా ఒకసారి ‘వారిది ఒళ్ళు బలిసి చేస్తున్న పాదయాత్ర అని మళ్ళీ మళ్ళీ అంటాను’ అంటూ నొక్కి చెప్పడం ద్వారా తన మంత్రిననే అహంకారాన్ని అంబటి రాంబాబు ప్రదర్శించినట్లయింది. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ వారు రైతుల ముసుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ వారని ఆరోపిస్తున్నారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ వారిని అడుగడుగునా అడ్డుకొంటామని హెచ్చరిస్తుంటారు.

తన మంత్రులు రైతులను ఉద్దేశ్యించి ఇంత అనుచితంగా మాట్లాడుతుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి వారిని వారించడం లేదు. అంటే వారిని ఆవిదంగా మాట్లాడమని ప్రోత్సహిస్తున్నది ఆయనే అనుకోవాలా?

జగన్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో అమరావతిని నిర్మించదని స్పష్టం అయిపోయింది. పర్వాలేదు! రాష్ట్ర ప్రజలు అమరావతిని కోరుకొంటున్నారో లేదో వచ్చే ఎన్నికలలో స్పష్టం అవుతుంది. రాజధాని కోసం తమ భూములిచ్చిన రైతులనుద్దేశ్యించి ఇంత అవమానకరంగా మాట్లాడుతున్న మంత్రులను తమ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమిస్తారా?అని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తే మంచిది.

ఇది ప్రజాస్వామ్య దేశమే తప్ప రాజరిక వ్యవస్థ కాదు. కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు నిర్ణయాలపట్ల నిరసన తెలిపినట్లే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం పట్ల రాజధాని రైతులు నిరసనలు తెలుపుతున్నారు. అది వారి హక్కు. ఆ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. తాము ప్రజలను చైతన్యపరుస్తున్నామని రైతులు చెపుతున్నారు.

మూడు రాజధానుల గురించి వైసీపీ నేతలు తమ వాదనలు వినిపిస్తున్నప్పుడు, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు అమరావతి గురించి తమ వాదన ప్రజలకు తెలియజేసే హక్కు లేదా?ఉందని హైకోర్టు భావించింది కనుకనే వారి మహాపాదయాత్రకు అనుమతించింది. కానీ ‘వారిని ఎగరేసి నరుకుతామని’ ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలతో గుడివాడలో పోస్టర్లు పెట్టడం ఏమిటి? హైకోర్టు అనుమతించినా వారి పాదయాత్రకి అడ్డుకొంటామని మంత్రులు చెప్పడం ఏమిటి?

మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైసీపీ మంత్రులు గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు రైతుల పాదయాత్రని చూసి ఇంత భయపడటం దేనికి?వారిపై ఇంత విషం కక్కడం దేనికి?

గత ఎన్నికలలో అమరావతే రాజధాని అన్నట్లు మాట్లాడుతూ వైసీపీ ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు అంతా తేటతెల్లమైంది. కనుక ప్రజలకు అమరావతి కావాలో మూడు రాజధానులు కావాలో వచ్చే ఎన్నికలలో తేల్చి చెపుతారు. కనుక అంతవరకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓపికపడితే చాలు. ఒకవేళ మళ్ళీ వైసీపీనే గెలిపిస్తే అప్పుడు రైతులే కాదు ఎవరూ కూడా మళ్ళీ అమరావతి కావాలని అడగరు.