Ambati rambabu 10th paper leak issueవైసీపీ ప్రభుత్వంలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు ఉన్నట్లే, బూతులు మాట్లాడేవారు, ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు ఎదురుదాడి చేసేవాళ్ళు, సంక్షేమ పధకాల డప్పు కొట్టేవాళ్ళు వేరేగా ఉన్నారు. ఈ మూడు విభాగాలను జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చక్కగా కవర్ చేస్తుంటారు.

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి పి.నారాయణను హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడంపై టిడిపి నేతల విమర్శలపై స్పందిస్తూ, “ప్రశ్నాపత్రాలను లీక్ చేసేది వారే…మళ్ళీ గోల చేసేది వాళ్ళే… నిందితులపై పోలీసులు చర్యలు తీసుకొంటే మళ్ళీ వాళ్ళే గోల గోల చేస్తుంటారు. పేపర్లు లీక్ చేస్తుండటం వలననే నారాయణ విద్యాసంస్థలు రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాయి. పేపర్లు లీక్ చేశారని నిర్ధారించుకొన్నాకనే ఆయనను అరెస్ట్ చేశాము. తప్పా?” అని ప్రశ్నించారు.

మంత్రి అంబటి రాంబాబు తమ ప్రభుత్వాన్ని, సిఎం జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ నారాయణ వంటి ప్రముఖుడు గురించి, రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాయని చెపుతున్న నారాయణ విద్యాసంస్థల గురించి అత్యుత్సాహంతో ఏదేదో మాట్లాడేస్తే రేపు పరువు నష్టం కేసులు ఎదుర్కోవలసి రావచ్చని మరిచిపోతున్నారు.

మాజీ మంత్రి నారాయణ, ఆయన విద్యాసంస్థలు నిజంగా తప్పు చేశాయా లేదా అనేది న్యాయస్థానం విచారణ జరిపి తేల్చి చెపుతుంది. కానీ ఆలోగానే మంత్రి అంబటి రాంబాబు వంటివారు ఈవిదంగా తీర్పులు చెప్పేస్తూ, పోలీసులు ఈ కేసును ఏ కోణంలో దర్యాప్తు చేసి ఏవిదంగా సాక్ష్యాధారాలు ఏర్పాటు చేసుకోవాలో చెపుతున్నట్లు ఉంది. ఇంకా కేసు కోర్టుకు వెళ్ళక మునుపే ఫాస్ట్-ట్రాక్ కోర్టుల కంటే వేగంగా వైసీపీ మంత్రులే తీర్పులు చెప్పేస్తున్నప్పుడు ఇక పోలీస్ దర్యాప్తులు, విచారణలు, కోర్టులో కేసులు ఎందుకు?అవకాశం ఉంటే శిక్షలు కూడా విధించేస్తారేమో?