Amazon CEO Andy Jassy Says Layoffs Will Extend Into Next Year 2023అవును ఈ సలహా చెప్పింది జెఫ్ బెజోస్! ప్రముఖ అంతర్జాతీయ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సీఈవో. వాషింగ్‌టన్‌లో మీడియాతో జెఫ్ బెజోస్ మాట్లాడుతూ, ఆర్ధిక మాంద్యం ముంచుకు వస్తోందని కనుక పండుగల సీజనులో ప్రజలు డబ్బుని ఫ్రిజ్‌లు టీవీలు, ఏసీలు, కార్లు, బైకులు వంటి వస్తువులు, వాహనాల కోసం ఖర్చు చేసేయకుండా వీలైనంత సొమ్మును పొదుపు చేసుకోవాలని సూచించారు. ఇక చిన్న వ్యాపారాలు చేసేవారు వ్యాపార విస్తరణ పెట్టుబడి గురించి ముందుగా ఆలోచించాలని అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని సూచించారు. రిస్క్ వ్యవహారాలకు దూరంగా ఉంటూ అందరూ నగదు నిల్వలు పెంచుకోమని సూచించారు.

“అంతా మంచే జరగాలని ఆశిద్దాం. ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందాం,” అని జెఫ్ బెజోస్ అన్నారు. సుమారు 10 లక్షల కోట్లు విలువగల ఆస్తులు కలిగిన జెఫ్ బెజోస్ అంతటివ్యక్తి ఆర్ధిక మాంద్యం గురించి ఇంతగా ఆలోచిస్తున్నారంటే, ఐ‌టి ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఇంకెంత ఆలోచించాలి?

ఒకప్పుడు భారత్‌లో అందరూ తప్పనిసరిగా పొదుపు పాటించేవారు. అందుకే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడగలిగేవారు. కానీ ఇప్పుడు ఐ‌టి కంపెనీలో ఉద్యోగాలు… లక్షల్లో ప్యాకేజీలు వస్తుండటంతో “జీవితాన్ని ఎంజాయ్ చేయాలి… విలాసంగా జీవించాలి…” అనే పాశ్చాత్య ధోరణి బాగా పెరిగిపోయింది.

ఉద్యోగం దొరకాగానే పెద్ద ఇల్లు, ఖరీదైన కారు లేదా బైకులు వాయిదాల పద్దతిలో కొనడం పరిపాటిగా మారింది. ఉద్యోగం పోయినప్పుడు ఆ వాయిదాలు చెల్లించలేక, ఆ దర్జా జీవితాన్ని వదులుకోలేక అవస్థలు పడుతున్నవారు కోకొల్లలు ఉన్నారు. ఇక సామాన్య ప్రజల విషయానికి వస్తే, ఇదివరకు ఎన్నడూ లభించని వస్తువులు, ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లను ముంచెత్తుతుండటంతో వారు కూడా ఆ ఆకర్షణలో పడి ఖర్చుకి బాగా అలవాటు పడ్డారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు పోటాపోటీగా అమ్మకాలు చేసుకొని వేలకోట్లు లాభాలు ఆర్జించడమే ఇందుకు తాజా నిదర్శనం.

కానీ అటువంటి ఆఫర్లకు బుట్టలో పడకుండా వీలైనంత వరకు పొదుపు చేసుకొని రాబోయే ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్దంగా ఉండమని అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ స్వయంగా చెపుతున్నారు. కనుక అనవసరమైన షాపింగులకి, ఖర్చులకి దూరంగా ఉండటం చాలా మంచిది.

చివరిగా ఒక మాట: అమెజాన్ కంపెనీ కూడా సుమారు 10,000 మంది ఉద్యోగులను త్వరలోనే తొలగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే వారూ ఈ ఖర్చుల బాధితులుగా మారబోతున్నారన్న మాట! కనుక అందరూ జెఫ్ బెజోస్ సలహా పాటించడం చాలా మంచిది.