amaravati with vaastu constructionఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు నేతృత్వంలోని న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌పై దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో తొలుత చేప‌ట్ట‌బోయే నిర్మాణాల‌ కోసం ప్ర‌భుత్వ ప‌ర‌మైన క‌స‌ర‌త్తు పూర్త‌యింది. రాజ‌ధాని నిర్మాణంలో భాగంగా మొదట ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం గ‌తంలోనే ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ‌ (సీఆర్‌డీఏ) తొలి అడుగు పడింది.

ప్రభుత్వ కార్యాలయాలు, వీఐపీ, సిబ్బంది నివాసాల నిర్మాణాలకు అవసరమైన డిజైన్లు అందించే సంస్థలను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలిచింది. ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైన్‌, ల్యాండ్‌స్కేప్‌, ఇంటీరియర్‌ డిజైన్‌ రంగాల్లో అనుభవం ఉన్న సంస్థలను ఎంపిక చేసేందుకు వేర్వేరుగా టెండర్లను ఆహ్వానించింది. కనీసం ఐదు నుంచి పదేళ్ల అనుభవం ఉన్న వారే అర్హులుగా పేర్కొన‌డం ద్వారా అనుభ‌వం ఉన్న సంస్థ‌ల‌కు అవకాశం క‌ల్పించ‌నుంది. హీటింగ్‌, వెంటిలేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ డిజైన్‌ (హెచ్‌వీఎసీసి) పద్ధతిలో నిర్మాణాలుండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజలు వినియోగించుకునే విధంగా స్థలాలనూ ఎంపికచేసి వాటినీ అభివృద్ధి చేయాలని పేర్కొంది.

తొలిదశలో ఏర్పాటు చేయ‌నున్న ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్రటేరియట్‌, విభాగాల ముఖ్యులు (హెచ్ఓడీ), స్వయం ప్రతిపత్తి గల సంస్థల కోసం 1312 ఎకరాలు, సిబ్బంది ఇళ్ల కోసం 740 ఎకరాలు, వీఐపీ హౌసింగ్‌ కోసం 328 ఎకరాలు, రాజ్‌భవన్‌ కోసం 92 ఎకరాలు, ముఖ్యమంత్రి కార్యాలయం కోసం 69 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహం కోసం 74.04 ఎకరాలు… ఇలా మొత్తం 2615 ఎకరాల్లో నిర్మాణాలు ఉంటాయని సీఆర్‌డీఏ పేర్కొంది. ఈనెల 11వ తేదీన టెండర్ల దరఖాస్తు చివరి తేదీగా పేర్కొనగా, 14వ తేదీన టెండర్లు ఫైనల్‌ చేయనున్నారు. అనంత‌రం నెల‌ రోజుల్లోపు ద‌శ‌ల‌ వారీగా ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని సమాచారం.