amaravati singapore consortium lands sale for welfare schemesఅమరావతి పరిధిలో గతంలో సింగపూర్ కన్సార్టియం కు స్టార్టుప్ ఏరియా అభివృద్ధికి కేటాయించిన 1600 ఎకరాలను విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. అమరావతి ప్రాంత పరిధిలో స్టార్టప్‌లను ఏర్పాటు చేయడానికి ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని సింగపూర్ కన్సార్టియానికి అప్పగించింది.

రాజధానిని తరలించడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగింది. ఇప్పుడు ఆ భూములను విక్రయించడం ద్వారా వచ్చిన నిధులు మిషన్ బిల్డ్ ఏపీకి బదలాయిస్తారని చెబుతున్నారు. ఆ నిధులు రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ముమ్మర ప్రయత్నాలను సాగిస్తోన్న నేపథ్యంలో.. అమరావతికి ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విషయం దీనితో మరోసారి స్పష్టమైందని అంటున్నారు. అయితే రాజధానికి భూములిచ్చిన రైతులు ఇప్పటికే రాజధాని తరలంపుపై న్యాయపోరాటం చేస్తున్న తరుణంలో ఇది జరిగే అవకాశం ఉందా అనేది చూడాలి.

రైతులకు చేస్తామన్న అభివృద్ధి చెయ్యకుండా, వారు ఇచ్చిన భూములకు న్యాయం చెయ్యకుండా వాటిని తెగనమ్ముతాము అంటే కోర్టులు ఒప్పుకుంటాయో లేదో చూడాలి. దీనిపై రైతులు అతితొందరలోనే స్టే కోసం హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది.