amaravati seed capitalనవ్యాంధ్ర రాజధాని అమరావతి ‘మాస్టర్ ప్లాన్’ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ ప్లాన్ పై ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఉంది. 2050 నాటికి ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేయబడిన ఈ ప్లాన్ పై మరో 30 రోజుల్లో ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. 30 రోజుల తర్వాత సదరు అభిప్రాయాలన్నీ సేకరించి సీఆర్డీఏ ఒక నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియతో అమరావతి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

అయితే, తుది మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని జాబితాలో నుండి కొన్ని గ్రామాలను తొలగించారు. గతంలో ప్రతిపాదించిన గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, వడ్డమాను, పెదపరిమి గ్రామాలను తొలగించారు. అలాగే కృష్ణాజిల్లాలోని కోటికలపూడి, మూలపాడు, త్రిలోచనపురం, వడ్దేశ్వరాలను కూడా తొలగించారు. భూసమీకరణ చేపట్టని ఈ గ్రామాలను కూడా రాజధానిలో చేర్చడం పట్ల రాజధాని గ్రామ వాసులలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, వీటిని తొలగించినట్లుగా సీఆర్డీఏ అభిప్రాయ పడింది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల అభిప్రాయాలకు మిక్కిలి గౌరవం ఇస్తామని సీఆర్డీఏ తెలిపింది.

ఊహించని ఈ ట్విస్ట్ తో సదరు 9 గ్రామాల జనులు అవాక్కయ్యారు. గతంలో రాజధాని గ్రామాలు అంటూ ఎంతో ప్రాధాన్యతను దక్కించుకున్నాయని, కానీ తాజా పరిణామాలతో ఆ విశిష్టత దూరమవుతుందని ఆందోళన చెందుతున్నారు. అలాగే, ఆ 9 గ్రామాల్లో కూడా రియల్ ఎస్టేట్ భారీ స్థాయిలో పడిపోయే అవకాశాలు కనపడుతున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.