Amaravati -Framersప్రపంచ స్థాయి రాజధానిగా రూపు చెందుతుంది అనుకున్న అమరావతి కల ఆదిలోనే చిద్రం అయిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని కోసం భూములిచ్చిన రైతులను మూడు రాజధానులు పేరిట రోడ్డు మీద పడేశారు. తాజాగా రైతులనుండి సమీకరించిన భూమి ఇప్పుడు పప్పుబెల్లల లాగా పంచిపెట్టడానికి సిద్ధం అవుతుంది ప్రభుత్వం.

రాజధాని ప్రాంతం లో 1251 ఎకరాలు 54,307 లబ్దిదారులకు పంచి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. రాజధాని అమరావతికి పూర్తిగా వెలుపల, దూరంగా ఉన్న పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందినవారితో పాటు.. కృష్ణా నదికి రెండో పక్కన ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకూ అమరావతిలో స్థలాలను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.

ప్రపంచ స్థాయి రాజధాని అభివృద్ధి ఏర్పాటు క్రమంలో సమీకరించిన భూమిలో 5 శాతం పేదలకు ఇవ్వాలని సీఆర్డ్ఏ చట్టంలో ఉంది. అయితే ఆ చట్టం రద్దు చెయ్యడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టింది ప్రభుత్వం. తనకు ఉన్న మెజారిటీతో అసెంబ్లీ లో పాస్ చేయించుకుంది కూడా. అయితే మండలిలో బ్రేక్ పడింది. అయితే తాము రద్దు చేయాలనుకున్న చట్టం మేరకే పేదలు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అంటూ వితండవాదం చేస్తుంది ప్రభుత్వం.

ఇది లీగల్ గా నైతికంగా పసలేని వాదన. అయితే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి 151 సీట్లు ఇచ్చి ఆ ప్రభుత్వం అందరినీ కలుపుకు పోయేలా వ్యవహరించాలి అనుకోవడం అత్యాశే. సరిగ్గా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు ఎవరిని నిందించుకోవాలి? అయితే రాజధానికి భూములిచ్చిన రైతులను ఇప్పుడు ఆ దేవుడు లేదా కోర్టులే కాపాడాలి. కలియుగంలో దేవుడు కూడా ప్రత్యక్షం కిందకు రాలేదు. ఆయన కూడా ఏం చేసినా కోర్టుల ద్వారానే చెయ్యాలి.