Amaravati JAC Leader Tirupati Rao counter to minister Ambati Rambabuఅమరావతి కోసం అరసవెల్లి వరకు మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు ప్రజలు నీరాజనాలు పడుతుంటే, వైసీపీ మంత్రులు మాత్రం వారి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండటం చాలా బాధాకరం. మంత్రి అంబటి రాంబాబు వారిని ఉద్దేశ్యించి, “అవును నేను అన్నాను… మళ్ళీ మళ్ళీ అంటాను. వారు ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తున్నారు,” అంటూ ట్వీట్ చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను మంత్రి హోదాలో ఉన్నవారు ఇంత అనుచితంగా మాట్లాడుతుండటం చూసి రాష్ట్ర ప్రజలు సైతం దిగ్బ్రాంతి చెందుతున్నారు. మంత్రుల నోటికి అమరావతి రైతులు బలవుతుండటం చూసి ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ఇంతకాలం చాలా ఓపికపట్టిన రైతుల జెఏసీ కన్వీనర్ తిరుపతిరావు తొలిసారిగా మంత్రి అంబటి రాంబాబుకి ఘాటుగా జవాబిచ్చారు. బుదవారం ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు మీ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రలు చేశారు. ఇప్పుడు మీ అధినేత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. వారు ముగ్గురూ కూడా ఒళ్ళు బలిసే పాదయాత్రలు చేశారని మీరనగలరా?

ఒక మంత్రి మమ్మలి వెదవలు, పెట్టుబడిదారులు అని నిందిస్తుంటాడు. మరో మంత్రి మాకు ఒళ్ళు బలిసిందంటాడు. మరొకరు అడ్డొస్తే నరికేస్తామంటాడు. మరొకరు హైకోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయకుండా మా పాదయాత్రను అడ్డుకొంటామని బెదిస్తుంటాడు. మేము వెదవాలం కాము… మీ అధినేత చేస్తున్న తప్పులను ఆయనకు చెప్పలేక, మీ పదవులు, కాంట్రాక్టులు, ఆస్తులు కాపాడుకోవడానికి ఆయన భజన చేస్తున్న మీరే వెదవలు.

ఓ మంత్రి తనకు 25 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకొంటారు. కానీ 25 ఏళ్ళలో ప్రజలకు, రాష్ట్రానికి ఏమైనా చేశారా? గుండెల మీద చెయ్యెసుకొని చెప్పండి. ఎంతసేపు మంత్రి పదవులు, డబ్బు, ఆస్తులు పోగేసుకోవడం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడికక్కడ రాజభవనాల వంటి ఇళ్ళు నిర్మించుకోవడం… ఇంతేగా మీరు చేసింది?రాష్ట్రం కోసం మేము మా భూములు ఇచ్చాము. కానీ మీరేమి ఇచ్చారు తీసుకోవడం తప్పిస్తే?” అని ఘాటుగా జవాబిచ్చారు.

కనుక ఇకనైనా మంత్రులు హుందాగా ప్రవర్తిస్తే వారికే మంచిది లేకుంటే ఇటువంటి ప్రశ్నలే ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు… రైతులను ఉద్దేశ్యించి అనుచితంగా వారు మాట్లాడుతున్న ఇటువంటి మాటలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని మరిచిపోకూడదు. కాదని నోరు జారితే రైతులు బాధపడవచ్చు కానీ వచ్చే ఎన్నికలలో ఓడిపోతే మంత్రులు ఇంకా ఎక్కువ బాధపడవలసిరావచ్చు.