amaravati farmers singapore trip-నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను సింగపూర్ పర్యటనకు సీఆర్డీయే తీసుకువెళుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చివరి పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. రాజధానిలోని పలు గ్రామాలకు చెందిన 41 మంది రైతులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో సింగపూర్ లోని ముఖ్యమైన ప్రదేశాలను, కట్టడాలను రైతులు సందర్శిస్తారు.

అక్కడి విశేషాలను ఆ దేశ అధికారుల ద్వారా రైతులు తెలుసుకుంటారు. రైతులకు, సింగపూర్ అధికారులకు మధ్య సంధానకర్తలుగా సీఆర్డీయే అధికారులు కృష్ణ కపర్ధి, దివ్య తదితరులు వ్యవహరించనున్నారు. రైతులు సింగపూర్ పర్యటన ముగించుకుని ఈ నెల 22న తిరిగి వస్తారు. కాగా, సింగపూర్ దేశాన్ని రైతులు ప్రత్యక్షంగా చూసి, అదే తరహాలో అమరావతి అభివృద్ధి చెందేలా తమ వంతు తోడ్పాటును అందించే నిమిత్తం ఈ పర్యటనను రైతులకు సీఆర్డీయే నిర్వహిస్తోంది.