Amaravati Farmers obstruct ys jagan convoyఅమరావతిలో రాజధాని తరలింపుపై రైతులు చేస్తున్న పోరాటం 21వ రోజుకు చేరింది. ఈరోజు హై పవర్ కమిటి తొలిసారిగా సమావేశం కానుండడంతో రైతుల తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దానితో ముఖ్యమంత్రి జగన్ కు కూడా అమరావతి సెగ తగిలింది. సెక్రటేరియట్ కు జగన్ వెళ్తుండగా పలువురు ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

మందడంలో ముఖ్యమంత్రిని అడ్డుకునేందుకు మహిళలు యత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జై అమరావతి అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అయితే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ సందర్భంగా రైతులు జగన్ మూడు ప్రతిపాదనల విషయంలో పునరాలోచించాలని కోరారు.

ఐదేండ్లు రాజధానిగా ఉన్న అమరావతిని ఇప్పుడు క్యాపిటల్ సిటీకి అణువువైన ప్రదేశం కాదని చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా మంగళగిరి మండలం, చినకాకాని వద్ద రైతుల మంగళవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. దీంతో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌ జామ్ అయింది.

వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. రోడ్డుకిరువైపులా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా రైతులు తరలిరావడంతో పోలీసులు కట్టడిచేయలేక చేతులెత్తేశారు. అటుగా వెళ్తున్న మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని చినకాకాని హైవేపై రైతులు అడ్డుకున్నారు. చుట్టుముట్టి నినాదాలు చేశారు. అయితే ఎమ్మెల్యే కారును ఆపకుండా ముందుకెళ్లడంతో కొందరు రైతులు రాళ్లతో దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.