Amaravati Farmers meets Prof Kodandaramతెలంగాణ జేఏసి చైర్మన్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆదివారం ఆయన తన స్నేహితుడితో కలిసి అమరావతిలో పర్యటించారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పలు భవనాలను పరిశీలించారు. తుళ్లూరు మండలం మల్కాపురంలో రైతులు, జేఏసి నేతలతో సమావేశమయ్యారు.

పది రోజుల క్రితం ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంపై పోరాడుతున్న రైతులు హైదరాబాద్‌ వెళ్లి కోదండరాంను కలిశారు. తాము రెండు నెలల నుంచి ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, తమ పోరాటాన్ని తెలంగాణ ఉద్యమం తరహాలో ఎలా తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలో సూచించాలని కోరారు.

రైతులు తాము చేసిన త్యాగాల గురించి అన్ని వేదికలపై మరింత గట్టిగా మాట్లాడాలని సూచించారు. రైతులకు న్యాయం చేసేందుకు తాను కూడా పోరాడతానని హామీ ఇచ్చారు. నెలాఖరులోగా అమరావతిలో పూర్తి స్థాయిలో పర్యటిస్తానని చెప్పారు. హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత తన మిత్రబృందంలోని మేధావులతో చర్చించి, వారితో కలిసి వస్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిని ఎద్దేవా చేస్తున్నారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమో గానీ కోదండరాం ఇప్పుడు చెల్లని రూపాయి. తెలంగాణలోనే ఆయన ప్రాబల్యం ఏమీ లేదు. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో ఆయన పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు ఆయన ఏపీలో ఏం చేస్తాడు,” అని అంటున్నారు.