Amaravati Farmers Mahapadayatra stopped by Police at Pasalapudiనేడు కోనసీమ జిల్లా పసలపూడిలో పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతుల దయనీయ స్థితి చూసినప్పుడు బహుశః దేశంలో మరే రైతన్నకి ఇంతగా అవమానం జరిగి ఉండదేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు వైసీపీ కార్యకర్తల దాడుల నుంచి పోలీసులు వారికి రక్షణగా నిలిచేవారు. కానీ ఇప్పుడు పోలీసులే వైసీపీ కార్యకర్తల్లా మారి వారిని అడ్డుకొంటున్నారు. ఏమంటే హైకోర్టు అనుమతించిన 600 మంది రైతులు తమ ఐడీ కార్డులు చూపితేనే ముందుకు వెళ్లనిస్తాం లేకుంటే కదలనిచ్చేదే లేదంటూ వారిని అడ్డుకొన్నారు. దాంతో వారు కూడా మొండికేసి ఆవేశంగా ముందుకు సాగబోయారు. పోలీసులకు, రైతులకు మద్య జరిగిన తోపులాటలో పలువురు రైతులు గాయపడ్డారు. కొందరు వృద్ధ మహిళలు సొమ్మసిల్లిపోయారు.

స్థానికులు వారి పరిస్థితి చూసి జాలిపడినా వారికి సాయం చేయలేకపోతున్నారు. ఎందుకంటే హైకోర్టు ఆదేశం ప్రకారం స్థానికులు దూరంగా ఉండి సంఘీభావం తెలపాల్సిందే తప్ప వారిని కలవడానికి వీల్లేదని పోలీసులు చెపుతున్నారు. కాదని ఎవరైనా రైతులవద్దకు వెళితే వారిపై కూడా కేసులు నమోదు చేయడానికి వెనకాడరు.

ఇదంతా చూస్తున్నప్పుడు అసలు పాదయాత్ర చేస్తున్నది సామాన్య రైతులేనా లేక ఉగ్రవాదులో వేర్పాటువాదులా అనే అనుమానం కలుగుతుంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతన్నలను మనం గౌరవించుకోవాలి. గౌరవించుకోలేకపోతే కనీసం వారిని ఇంతగా హింసించకుండా ఉన్నా చాలు. వారి మానాన్న వారు పాదయాత్ర చేసుకొంటూ ముందుకు సాగిపోతారు కదా? కానీ వారేదో రాష్ట్రాన్ని విడగొట్టడానికి కత్తులుబల్లేలు పట్టుకొని యుద్ధానికి బయలుదేరి వస్తున్న సుశిక్షితులైన సైనికదళం అన్నట్లు పోలీసులు వారిని అడ్డుకోవడం చాలా బాధాకరం.

ఇంతకీ వారు పాదయాత్ర చేసుకొంటూ అరసవిల్లికి వెళ్తే అమరావతిలో రాజధాని ఏర్పడిపోతుందా?అంటే ఎట్టి పరిస్థితులలో ఏర్పడదని తెలుసు. మరి రైతున్నల్లను ఇంతగా వేధించడం, అవమానించడం దేనికి?ఇదేనా వైసీపీ సంస్కారం?

ఇక రాజధాని రైతన్నలకు అడుగడుగునా ఇంతగా అవమానిస్తున్నా రాష్ట్ర బిజెపి నేతలు తమకు పట్టన్నట్లు చూస్తూ కూర్చోవడం ఇంకా దారుణం. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలుకంటున్నప్పుడు, రైతన్నలకు అండగా నిలబడలేరా?అమరావతికే తమ మద్దతు అని చెప్పుకొని పాదయాత్రలు చేసిన బిజెపి నేతలు, అమరావతి కోసమే పాదయాత్ర చేస్తున్న రైతులకు అండగా ఎందుకు నిలబడటం లేదు?కేంద్ర ప్రభుత్వం చేత ఒక్క మాట చెప్పిస్తే వైసీపీ ప్రభుత్వం వారి జోలికి వెళ్ళే సాహసం చేయగలదా?

ఏపీ రాష్ట్ర బిజెపి నేతల మౌనం చూస్తే ‘బీజేపీ అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని ఆశిస్తుంది కానీ ప్రజల గోడు పట్టించుకోదని’ తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఊరికే అనలేదనిపిస్తుంది! రాష్ట్ర సమస్యలతో, ప్రజల సమస్యలతో తమకి సంబందం లేదని వారనుకొంటున్నట్లయితే రేపు తమ పార్టీకి ఓట్లు వేయమని ప్రజలని అడిగే హక్కు కూడా వారికి ఉండదని గ్రహిస్తే మంచిది.