Maha-Padayatraఅమరావతి రైతుల మహాపాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి నేటి వరకు దానికి ఆటంకాలు కల్పించడానికి, ప్రజలలో వారిపై ద్వేషం రగిలించడానికి వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. అడుగడుగునా వైసీపీ శ్రేణుల చేత వారిని బెదిరిస్తూ ప్రజలే వారిని వ్యతిరేకిస్తున్నారని అబద్దాలు చెపుతున్నారు.

ఈ నెల 17వ తేదీన వారి పాదయాత్ర రైల్ కమ్ రోడ్డు వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ప్రవేశించాల్సి ఉంది. అయితే వారిని ఏదో విదంగా అడ్డుకోవాలని పట్టుదలగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం రాజమండ్రి రైల్ కమ్ రోడ్డు వంతెనను మరమత్తుల పేరుతో వారం రోజుల పాటు మూసేసింది!

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆ వంతెనపై ప్రయాణించే అన్ని వాహనాలను ధ్వళేశ్వరం కాటన్ బారేజీ మీదుగా మళ్ళించబోతున్నారు. అయితే దీని కంటే ధవళేశ్వరం వంతెనే ఎక్కువ పాడైపోయుంది. కనుక మరమత్తులు చేయాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ముందుగా ఆ వంతెనకు చేయాలి కదా? కానీ పాడైన ఆ వంతెనను పట్టించుకోకుండా రైతులు పాదయాత్ర సాగే రైల్ కమ్ రోడ్డు వంతెనను మరమత్తులు చేయాలనే పేరుతో మూసివేయడం దేనికో అర్దం అవుతూనే ఉంది.

పైగా పాడైన ధవళేశ్వరం వంతెన మీదుగా ద్విచక్రవాహనాలను, ఆర్టీసీ బస్సులను మళ్ళిస్తుండటం మరో పొరపాటు. ఇన్నేళ్ళుగా గోతులు పడిన రైల్ కమ్ రోడ్డు వంతెనను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం హటాత్తుగా రైతులు అక్కడికి చేరుకొనే సమయానికి మరమత్తుల సాకుతో మూసేయడం చూస్తే రైతులను అడ్డుకోవడానికి ఎంతగా దిగజారిపోయిందో అర్దమవుతోంది. ఒకవేళ ఆ వంతెనకు అత్యవసరంగా మరమత్తులు చేపట్టాలనుకొంటే రైతులు ఆ వంతెన మీదుగా రాజమండ్రి చేరుకోగానే మొదలుపెట్టవచ్చు కదా?

వంతెనను మూసివేయడంపై టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ, “కొంచెం అయినా సిగ్గుండాలి! ఇన్నాళ్ళు గుర్తుకురాని రైల్వే బ్రిడ్జి మరమత్తులు అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర వస్తుంది అని రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిని మరమత్తుల పేరుతో ఆపేస్తారా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మేమూ ఇలాగే వ్యవహరించిఉంటే మీరు ఏమి చేసేవాళ్ళు?” అని ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో పూర్తిగా దెబ్బతిన్న ధవళేశ్వరం వంతెన ఫోటోని షేర్ చేస్తూ, “జగన్ గారు… ముందర ధవళేశ్వరం బ్రిడ్జి పరిస్థితి చూడండి. పాడైపోయిన బ్రిడ్జిని వదిలేసి రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిని ఆపేస్తున్నారు.. అమరావతి రైతుల పాదయాత్ర చూసి బయపడ్డావు రెడ్డి…” అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరో ట్వీట్ చేశారు.