Amaravati-Maha-Padayatra-Policeఅమరావతిని రాజధానిగా చేయాలంటూ అరసవిల్లికి పాదయాత్రగా వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొంటుండటంతో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైతు సంఘం ప్రకటించింది.

రైతుల పాదయాత్ర నేడు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభం కావలసి ఉంది. అయితే అక్కడ రైతులు బస చేసిన ఫంక్షన్‌ హాలును ఈరోజు ఉదయమే పోలీసులు చుట్టుముట్టి వారిని అడ్డుకొన్నారు. ఐడీ కార్డులు చూపితేనే పాదయాత్రకు అనుమతిస్తామని చెపుతూ పోలీసులు వారిని అడ్డుకోవడంతో రైతులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైటాయించి నిరసన తెలిపారు. కానీ పోలీసులు వారిని ముందుకు సాగనీయమని స్పష్టం చేయడంతో, రైతులు తమలో తాము చర్చించుకొని పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

పోలీసుల తీరుని హైకోర్టులోనే ప్రశ్నించి తేల్చుకొంటామని రైతులు తెలిపారు. అయితే ప్రస్తుతం హైకోర్టుకి దీపావళి సెలవులు మొదలైనందున, మళ్ళీ కోర్టు తెరిచిన తర్వాత కోర్టులో తేల్చుకోన్నాకనే పాదయాత్ర మొదలుపెడతామని చెప్పారు. అయితే ఎట్టి పరిస్థితులలో అరసవిల్లి వరకు మహాపాదయాత్ర చేసి తీరుతామని చెప్పారు.

తమ పాదయాత్రకు హైకోర్టు అనుమతించినప్పటికీ, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించినప్పటికీ, పోలీసులే తమపై దౌర్జన్యం చేస్తూ ఎక్కడికక్కడ తమను అడ్డుకొంటున్నారని రైతులు ఆరోపించారు. ఇవాళ్ళ తాము కొత్తగా పాదయాత్ర మొదలుపెట్టలేదని, గత 41 రోజులుగా పాదయాత్ర చేస్తున్నామని, కానీ నిన్నటి నుంచి పోలీసులు అడుగడుగునా తమని అడ్డుకొంటూ ఈవిదంగా వేధిస్తున్నారని, వృద్ధులు, మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని రైతులు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. తమకి రక్షణ కల్పించాల్సిన పోలీసులే తమను వేధిస్తుంటే ఇక హైకోర్టుకి కాక ఎవరికి మొరపెట్టుకోగలమని అడుగుతున్నారు.

స్థానికులు వారి పరిస్థితి చూసి జాలిపడి సాయం చేద్దామనుకొంటున్నప్పటికీ పోలీసులు వారిని కూడా అడ్డుకొంటున్నారు. రైతుల దగ్గరకి వెళ్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తుండటంతో అందరూ దూరంగా ఉండిపోవలసి వస్తోంది. మొదటి నుంచి వారి పాదయాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వారిని ప్రజల నుంచి విడదీసి ఒంటరివాళ్ళను చేసి నడిరోడ్డుపై నిస్సహాయంగా నిలబెట్టింది! ఇది పైశాచిక ఆనందం కాక మారేమిటి?

వైసీపీ నేతలు, కార్యకర్తలు వారిని అడ్డుకొంటే నాయస్థానంలో తమ ప్రభుత్వానికి మొట్టికాయలు పడతాయని ఇప్పుడు తెలివిగా పోలీసుల చేత వారిని ముందుకు కదలకుండా కట్టడి చేస్తోందని అర్దం అవుతూనే ఉంది. ఏమంటే వారి పాదయాత్రతో శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు కోర్టులో చెప్పుకోగలరు. ఒకవేళ మొట్టికాయలు పడితే పోలీసులకే పడుతాయి తప్ప వైసీపీ నేతలకు పడవు కదా?

రాజకీయంగా ఇంత దూరదృష్టితో ఆలోచించి చాలా తెలివిగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం, రాజధాని రైతుల పట్ల తాము వ్యవహరిస్తున్న తీరును యావత్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాష్ట్రంలో రైతులందరూ నిశితంగా గమనిస్తున్నారని, ఈ ఒక్క కారణంతోనే రేపు ఎన్నికలలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం ఉందని గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైసీపీ చర్యలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు అనిపించక మానదు.