Capital Amaravati Farmers missing complaint on Alla ramakrishna reddyమూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతికి భూములిచ్చిన రైతులు చేస్తున్న ఆందోళన తొమ్మిదవ రోజుకు చేరుకుంది. రేపు కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అమరావతిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బయటవారిని ఎవరినీ తమ ఇళ్లలోకి రానివ్వకూడదని అన్ని ఇళ్లకు నోటీసులు జారీ చేసారు.

కేంద్రం ఈ విషయంలో కలుగజేసుకుని, ఈ ప్రయత్నాన్ని నిలువరిస్తుందని వారు కోటి ఆశలతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా స్థానిక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళన జరుగుతున్న నాటి నుండీ బయటకు రాకపోవడం తో, ఆగ్రహించిన రైతులు ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చెయ్యడం తెలిసిందే. తమ ఎమ్మెల్యే కనపడటం లేదని ఏకంగా పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారు వారు.

ఎట్టకేలకు ఈరోజు బయటకు వచ్చారు ఆర్కే. తాను ఎక్కడకూ వెళ్లలేదని, తన అన్న కుమారుడి పెళ్లికి వెళ్లానన్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజధాని రైతులకు ఎట్టి పరస్థితుల్లో అన్యాయం జరగదని ఆళ్ల స్పష్టం చేశారు. అయితే తమకు జీవితాలు రోడ్డున పడుతుంటే ఎమ్మెల్యే పెళ్లికి వెళ్ళా అని చెప్పడం దారుణమని రైతులు అంటున్నారు.

ఇది ఇలా ఉండగా అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అగ్ర నేతలు కాసేపటి క్రితం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ అగ్రనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి హాజరు కానున్నారు.