దేశచరిత్రలో ఏదైనా పెద్ద ప్రాజెక్టుకు భూమిని తీసుకోవడం అంటే పెద్ద ప్రహసనమే. కొన్ని కొన్ని కీలక ప్రాజెక్టులు భూమి సమస్యల వల్ల ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది అమరావతిలో భూమి సమీకరణ ఎటువంటి వివాదం లేకుండా జరిగిపోయింది. 34,000 ఎకరాలకు పైగా భూమి అలవోకగా ప్రభుత్వం చెంతకు ఎటువంటి భారీ ఖర్చూ లేకుండా వచ్చేసింది.
అయితే ప్రభుత్వం మారాక రాజధానిని నిర్వీర్యం చేసే ప్రక్రియ జరుగుతుంది. ఇది రాజకీయ కారణాల వల్లే అని చెప్పనవసరం లేదు. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అని అంటున్నా, భవిష్యత్తులో పాలనా ఇబ్బందులు వల్ల అమరావతిలో ఉన్నవన్నీ విశాఖకు తరలించడం ఖాయం అని భావన అందరిలోనూ ఉంది.
ఇప్పుడు రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. వారి భూములు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు, అలానే వారి భూములు ఇదివరకటి రేటు లేదు. రైతులతో మాటు కొందరు ఇక్కడ భూములు పైసా పైసా కూడబెట్టి కొని, ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు వారి పరిస్థితి కూడా ఘోరంగానే ఉంది. దిక్కుతోచక వారు నిరసనలు చేపడుతుంటే వారిని విలన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది.
అధికార పార్టీవారు వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటుంటే… వారి అనుచర గణం సోషల్ మీడియాలోనూ, బయటా వారికి కులముద్ర, టీడీపీ ముద్ర వేస్తున్నారు. కొందరైతే ఏకంగా వారు అత్యాశాపరులని, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కంఠకులని నిందిస్తున్నారు. అయితే ప్రభుత్వం వారికి న్యాయం చేసిన ప్రమాణాలనే వారు కోరుకుంటున్నారని విషయం అంతా మర్చిపోతున్నారు. తమ నోటి కాడ కూడు లాగేసుకున్నా నోరుమెదపకూడదు అని కొందరు ఆశించడం మరింత దారుణం.