Save Amaravati agitation 150 daysఅమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు అని తాను ముఖ్యమంత్రి జగన్ కు సూచించినట్టు మంత్రి కొడాలి నాని ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై సీఎం జగన్ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.. అన్ని పక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుందామన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.

“యాభై ఐదు లక్షల పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నాం. దానిని కూడా అడ్డుకున్నారు. పేదలకు చోటు లేని చోట ప్రజాప్రతినిధులు కూర్చుని శాసనాలు చెయ్యడం భావ్యం కాదు,” అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అదే ప్రాంతానికి చెందిన మంత్రితో అమరావతి కన్ను పొడవాలని చూడటం దారుణం అంటున్నారు రైతులు.

ప్రభుత్వం వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన నాటి నుండీ అడుగు ముందుకు పడకుండా చేస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులలో పెండింగ్ ఉంది. వీలైనంత తొందరగా విశాఖపట్నంకు తరలి వెళ్ళాలి అనుకుంటున్న ప్రభుత్వానికి ఇది మింగుడుపడటం లేదు.

దీనితో ఇప్పటికైనా పట్టువదలకపోతే… ఈ మాత్రం కూడా మీకు దక్కదు అంటూ ఈ ప్రకటన ద్వారా బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కనిపిస్తుంది అంటూ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి. కోర్టు కేసులు వెనక్కు తీసుకుని ప్రభుత్వానికి సహకరిస్తారేమో చూడాలి.