Amaravati decission in the court of central governmentఏపీలో మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందినప్పటికీ…శాసన మండలిలో మాత్రం అడ్డంకి ఏర్పడింది. శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్‌ తగిలినట్టు అయ్యింది. ఏపీ శాసనమండలిలో టీడీపీ రూల్‌ 71ను తెర మీదకు తెచ్చి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పాడేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించే అవకాశం రూల్ నెంబర్ 71వల్ల కలుగుతుంది.

మండలి ఛైర్మన్ నిబంధనల ప్రకారం వెళ్తే ఇప్పట్లో మండలిలో బిల్లు చర్చకు వచ్చే అవకాశమే లేదు. దీంతో మండలినే రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిపుణుల వాదన ప్రకారం శాసన మండలి రద్దు అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలిని రద్దు చేసే, ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్ కుంది.

అయితే ఒకసారి రద్దయిన మండలిని ఏర్పాటు చేయాలన్నా.. ఒకసారి ఏర్పాటు చేసిన మండలిని రద్దు చేయాలన్నా దానికి శాసన సభ తీర్మానాన్ని ఆమోదించాలి. సభలోని మొత్తం సభ్యుల్లో మెజార్టీ సభ్యుల మద్దతు, తీర్మానం ఓటింగ్ కు పెట్టిన రోజు హాజరైన సభ్యుల్లో 2/3 వ వంతు మెజార్టీ ఉండాలి. అయితే శాసన సభ తీర్మానం చేయించడం వైఎస్సార్ కాంగ్రెస్ కు పెద్ద విషయం కాదు.

అయితే ఒక రాష్ట్రానికి సంబంధించి శాసన మండలిని ఏర్పాటు చేసినా…రద్దు చేసినా భారత రాజ్యాంగం కూడా మారుతుంది. అయితే ఆర్టికల్ 169 ప్రకారం అది రాజ్యాంగ సవరణ బిల్లు కాదు. శాసన మండలిని రద్దు చేయాలన్నా…ఏర్పాటు చేయాలన్నా దానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అయితే ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లినట్టు అవుతుంది. కేంద్రం అమరావతిని కొనసాగించాలి అనుకుంటే ఈ ప్రతిపాదనను తొక్కిపెట్టవచ్చు.