amaravati capital issueఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి, దాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్స్ కేటాయించడానికి హైకోర్టు ఇచ్చిన టైమ్ సరిపోదంటూ ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి బుదవారం హైకోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

హైకోర్టు ఆదేశాల ప్రకారం పనులు ప్రారంభించామని కానీ రాజధాని నగరాలు సుమారు 40-50 ఏళ్ళ వ్యవధిలో క్రమంగా అభివృద్ధి చెందుతాయి కనుక నిర్ధిష్ట గడువులోగా రాజధాని నిర్మాణం పూర్తయ్యే పనికాదని స్పష్టం చేశారు. నిధుల కొరత కారణంగా రాజధాని నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. కోర్టు కేసుల కారణంగా ఆరు నెలల గడువులోగా రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్స్ అందించలేమని అఫిడవిట్‌ ద్వారా తెలియజేశారు. కనుక ఈ రెంటికీ గడువు తొలగించడమో పొడిగించడమో చేయాలని కోర్టుని అభ్యర్ధించారు.

రాజధాని నిర్మాణానికి బ్యాంకుల కన్సార్టియంను సంప్రదించామని అవి రూ.3,500 కోట్లు రుణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించాయని, అది మంజూరు అయితే రాజధాని నిర్మాణ పనులు జోరుగా చేస్తామని అఫిడవిట్‌లో తెలిపారు. రాజధాని ప్రాంతంలో 331 ఫ్లాట్లను వేలం వేయడం ద్వారా మరో రూ.330 కోట్లు సమకూర్చుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అఫిడవిట్‌లో తెలిపారు.

వైసీపీ మంత్రులు నేటికీ మూడు రాజధానులే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని చెపుతుండటం అందరూ వింటూనే ఉన్నారు. కానీ హైకోర్టు ఒత్తిడి వలననే అమరావతిలో పనులు ప్రారంభించవలసి వచ్చింది. కనుక ప్రభుత్వం నిధుల కొరతను సాకుగా చూపుతోంది. ఒకవేళ నిధుల కొరతే ఉన్నట్లయితే నెలనెలా సంక్షేమ పధకాలకు వందల కోట్లు విడుదల చేయడం కూడా అసాధ్యమే కదా? కానీ వాటికి నిధుల కొరత లేదు? అంటే మళ్ళీ ఇక్కడ కూడా ప్రభుత్వ ప్రాధాన్యత సంక్షేమ పధకాలే తప్ప రాజధాని నిర్మాణం కాదని అర్దమవుతోంది.

రాజధాని నిర్మిస్తే కమ్మ సామాజిక వర్గానికి, టిడిపి నేతలకు లబ్ది కలుగుతుందనే వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది తప్ప రాష్ట్రానికి ఎంత లబ్ది కలుగుతుందో గ్రహించలేకపోతోంది. రాజధాని లేకపోవడం వలన రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, పెట్టుబడులు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయని, దాని వలన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని తెలిసి ఉన్నా నిధుల కొరత సాకుతో రాజధాని నిర్మాణపనులు నత్తనడకన నడిపిస్తుండటం చాలా శోచనీయం.

వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే, అత్యవసరమైన సంక్షేమ పధకాలను తప్ప మిగిలిన వాటన్నిటినీ పక్కన పెట్టి ఆ నిధులతో రాజధాని నిర్మాణ పనులు చురుకుగా జరిపించవచ్చు కదా?కానీ వైసీపీ ప్రభుత్వానికి ఎంత సేపు రాజకీయ కక్షలు, ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యమని భావిస్తోంది.

ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ముఖ్యమా లేక అధికార పార్టీకి ఎన్నికలలో గెలించేందుకు సంక్షేమ పధకాలు అమలు చేయడం ముఖ్యమా?అంటే సంక్షేమ పధకాలే ముఖ్యమని వైసీపీ ప్రభుత్వం భావిస్తుండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. వైసీపీ ప్రభుత్వ వైఖరి, ప్రాధాన్యతలు ఈవిదంగా ఉన్నప్పుడు ఇక దాని హయాంలో అమరావతి నిర్మాణం జరుగుతుందని, పూర్తవుతుందని ఆశించడం కూడా అనవసరం.