Amaravati Capital City Posh Locations, Amaravati Capital City Posh Locality, Amaravati Capital City Rich Locations, Amaravati Capital City Rich Areas  అమరావతి సీడ్ క్యాపిటల్ లో విలాసవంతమైన భవనాలు కావాలని, 150 ఎకరాలను తమకు కేటాయించి విల్లాలను నిర్మించి, ఈ ప్రాంతాన్ని ‘పోష్ లొకాలిటీ’గా మార్చాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు సీఆర్డీఏ (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ)పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టుగా మీడియా వర్గాల్లో సమాచారం హల్చల్ చేస్తోంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటు కొందరు మంత్రులు కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించి, హై ఎండ్ విల్లాలను ఎమ్మెల్యేల కోసం నిర్మించాలని గట్టిగానే కోరినట్టు సమాచారం.

అమరావతి మాస్టర్ ప్లాన్ లో ప్రధాన వాణిజ్య ప్రాంతంగా ఉద్దండరాయుని పాలెం ప్రాంతాన్ని ఎంపిక చేయగా, ఇదే ప్రాంతంలో మెట్రో రైల్ నెట్ వర్క్, వేలాది ఉద్యోగాలు కల్పించే ప్రధాన వ్యాపార కేంద్రాలు ఏర్పడనున్నాయి. ఇదే ప్రాంతంలో తమకు నివాస గృహాలను విలాసవంతంగా నిర్మించి ఇవ్వడం ద్వారా, మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించవచ్చని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

‘సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో సవివరణాత్మక మాస్టర్ ప్లాన్ ను స్విస్ చాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టు గెలుచుకున్న కంపెనీ అందిస్తుంది. ఈ ప్రాంతంలో అత్యాధునిక భవంతుల సముదాయం నిర్మితమైతే అది రాజధానికే తలమానికం అవుతుందని’ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కాంప్లెక్స్ లు, నగరానికి గేట్ వే, సాంస్కృతిక సెంటర్లు, కన్వెన్షన్ హాల్ తదితరాలు సీడ్ క్యాపిటల్ లో రానున్నాయి.

ఇక్కడ విలాసవంతమైన ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు టీడీపీ ఎమ్మెల్యేల నుంచి ముఖ్యంగా గుంటూరు ప్రాంత నేతల నుంచి మద్దతు అధికంగా లభిస్తున్నట్టు సమాచారం. “ప్రతి నగరానికి ఓ విలాసవంతమైన ప్రాంతం ఉంటుంది. అమరావతికి అలాంటి ప్రాంతం లేదు. కాబట్టే మేమిలా అడుగుతున్నాం” అని గుంటూరు జిల్లా నేత ఒకరు ఆఫ్ ది రికార్డ్ గా వ్యాఖ్యానించినట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే సదరు ఎమ్మెల్యేల ఆలోచనలకు సిఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రతిపక్షాలు అమరావతి భూములపై అనేక ఆరోపణలు చేసినప్పటికీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ, ఒక్కసారి చంద్రబాబు ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినవారవుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, కొన్ని నిర్మాణాలు జరిగిన తర్వాతైనా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలుస్తాయని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.