నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఏఏ భవనాలు ఎక్కడెక్కడ ఏర్పాటు కానున్నాయన్న విషయం ఖరారైపోయింది. జపాన్ సంస్థ ‘మాకీ’ రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేయడంతో అమరావతి నిర్మాణానికి మరో అడుగు ముందుకు పడింది. 2017 మేలో మొదలు పెట్టి 2018 డిసెంబరు నాటికి నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మొత్తం 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు రానుండగా, అందులో 70 శాతం విస్తీర్ణాన్ని జలవనరులు, పచ్చదనం కోసమే వినియోగిస్తారు. వెరసి చంద్రబాబు భావిస్తున్న ‘బ్లూ-గ్రీన్’ కాన్సెప్ట్ లో ప్రభుత్వం విజయవంతంగా తొలి అడుగు వేసినట్టయింది.
ఈ ప్లాన్ ప్రకారం అమరావతిలో కొత్తగా నిర్మితం కానున్న చట్ట సభ అసెంబ్లీ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు భవనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఏర్పాటు కానున్నాయి. ఇక రాజధానిలో కీలక భవనాలైన గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్, సీఎం అధికారిక నివాసాలు కృష్ణానదికి అభిముఖంగా కొలువు తీరనున్నాయి. మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మితం కానున్న అమరావతి కీలక భవనాల్లో రాజ్ భవన్, సీఎం నివాసం ఒకే బ్లాకులో ఏర్పాటు కానున్నాయి. వీటిలో కుడివైపున రాజ్ భవన్ ఉంటే, ఎడమ వైపున సీఎం అధికారిక నివాసం ఉండేలా డిజైన్ రూపొందింది. రాష్ట్ర పాలనలో రెండు కీలక కేంద్రాలుగా ఉండనున్న ఈ రెండు నిర్మాణాలు కృష్ణానది ఒడ్డున ఏర్పాటు కానున్నాయి. అలాగే ఈ రెండు నిర్మాణాల మధ్యన సువిశాల విస్తీర్ణంలో ‘పబ్లిక్ ప్లాజా’ పేరిట పెద్ద పార్కు ఏర్పాటు కానుంది.
నూతన సచివాలయం 60 అంతస్తుల్లో ఏర్పాటు కానుందని, చివరి అంతస్తులో అంతెత్తున సీఎం కార్యాలయం ఉంటుందని గతంలో వెలువడ్డ వార్తలకు భిన్నంగా, ఆర్భాటాలకు పోకుండా పర్యావరణ హితంగా రూపొందనున్న అమరావతిలో పరిపాలన కీలక కేంద్రం సచివాలయం (సెక్రటేరియట్) కేవలం 15 అంతస్తుల్లో మాత్రమే ఏర్పాటు కానుంది. మొత్తం అమరావతిలోని ప్రభుత్వ భవనాలన్నింటిలోకి 15 అంతస్తులతో ఏర్పాటు కానున్న సెక్రటేరియట్టే అత్యంత ఎత్తైన భవనంగా విరాజిల్లనుంది. ఈ భారీ భవంతిలో పైన 14వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఏర్పాటు కానుండగా, టాప్ ఫ్లోర్ లో మాత్రం సీఎం కార్యాలయం కొలువు దీరనుంది. అమరావతిలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ భవనాలన్నీ 7 అంతస్తుల లోపే నిర్మితం కానున్నాయి.