Andhra Pradesh - From No Capital to Three Capitals!అందరు ఆసక్తిగా ఎదురు చుసిన ఆంధ్రప్రదేశ్ కాబినెట్ సమావేశం, అమరావతి మరియు మూడు రాజధానుల ప్రతిపాదనపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఇప్పటికే ఉన్న జీఎన్ రావు కమిటి రిపోర్టుని, జనవరి 3న రాబోయే బీసిజీ రిపోర్టుని క్రోడీకరించి మరో కమిటి తయారు చేసే రిపోర్టుని పరిగణలోకి తీసుకుని ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం అని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఈరోజు ఉదయం వరకూ ఈ రోజే నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. నిన్న విశాఖపట్నం చేరుకున్న విజయ సాయి రెడ్డి రాజధాని ప్రకటన చేసి మొదటి సారి అక్కడకు వస్తున్న జగన్ కు గ్రాండ్ గా స్వాగత ఏర్పాట్లు చెయ్యాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 3 గంటల పాటు జగన్‌కు స్వాగత కార్యక్రమాలు ఉంటాయని.. చరిత్రలో నిలిచిపోయేలా స్వాగత కార్యక్రమం ఉంటుందన్నారు.

24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ఇంత హడావిడి చేసిన తరువాత ఎందుకు నిర్ణయం వాయిదా పడింది అని అంతా చర్చించుకుంటున్నారు. కేంద్రం ఏమైనా కలిపించుకుని నిర్ణయాన్ని ప్రస్తుతానికి ఆపిందా అని పలువురు అనుమాన పడుతున్నారు.

మరి కొందరు జీఎన్ రావు కమిటికి చట్టబద్దత లేకపోవడంతో ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అని అంటున్నారు. మరికొందరు ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు నిరూపిస్తే అమరావతిలో జరుగుతున్న రైతుల ఉద్యమం తేలిపోతుందని, అప్పుడు ప్రకటన చేస్తే రాజకీయంగా మంచిదని సీఎం ఆలోచన అని అంటున్నారు.