Amaravati as capital in ys jagan manifestoవైఎస్సార్ కాంగ్రెస్ అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తోందని… అధికారంలోకి వస్తే రాజధానిని మరొక చోటకి తరలించడం ఖాయమని టీడీపీ ప్రచారం చేస్తుంది, దీని వల్ల కృష్ణ, గుంటూరు జిల్లాలలో తమకు నష్టం కలుగుతుందని ఆ పార్టీ గ్రహించింది. దీనికి గాను ఒక ఇల్లు, ఆఫీసు నిర్మించుకుని ఈరోజే గృహప్రవేశం చేశారు జగన్. ఎప్పుడో వచ్చిన చంద్రబాబు ఇంకా అద్దె ఇంట్లో ఉంటున్నారని, ఓడిపోగానే తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారని, తాను ఇక్కడే శాశ్వతంగా ఉంటా అని జగన్ చెబుతున్నారు.

అమరావతిలో స్థిరనివాసం ఉన్న ఒకే ఒక్క ప్రధాన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఎన్నికల వరకు జగన్ ఇక్కడి నుండే పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోనున్నారు. మరోవైపు తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అమరావతి రాజధానిగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. దీనిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు. మెరుగైన రాజధానిని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు.

దీనిబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధం అవుతుంది. దీని వల్ల వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజధాని ప్రాంతంలో పుంజుకుంటుందేమో చూడాలి. మొదట్లో రాజధాని ప్రాంతంలో తమకు పట్టున్న గ్రామాలలో భూసేకరణ అడ్డుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. ఆ తరువాత కోర్టు కేసులు, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులతో రాజధానిని ఆపడానికి ప్రయత్నించింది. అయితే ఎన్నికల సమయంలో ఆ ప్రాంత ప్రజల ఓట్లు కోసం తన స్టాండ్ మార్చుకుంది. అయితే ప్రజలు దీనిని ఎంత వరకూ నమ్ముతారో చూడాలి.