This-Is-How-He-Tried-to-Trap-Amala-Paulకేరళ ముద్దుగుమ్మ అమలాపాల్ గతంలో పుదుచ్చేరిలో ‘బెన్స్ ఎస్ క్లాస్’ అనే 1.12 కోట్ల విలువ చేసే కారును కొనుగోలు చేసి, పన్ను ఎగ్గొట్టేందుకు పుదుచ్చేరిలోనే నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకుంటోంది. ఆ కారునే ప్రస్తుతం ఆమె కేరళలో ఉపయోగించుకుంటోంది. ఈ కేసులో ఇటీవలే ఆమె న్యాయస్థానంలో లొంగిపోయింది.

తాజాగా ఈ కేసులో త్వరగా ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాలని తమ పోలీసులను కేరళ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. పుదుచ్చేరిలో కారు రిజిస్ట్రేషన్‌ చేయించి, ఆమె కేరళ సర్కారుకి 20 లక్షల పన్ను ఎగ్గొట్టింది. అమలాపాల్‌ తో పాటు గతంలో ఇదే విధంగా పన్నులు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేష్‌ గోపీ, మరో నటుడు ఫహద్‌ ఫజిల్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వం వారికి పన్నులు చెల్లించేందుకు మరో అవకాశం ఇవ్వడంతో నటుడు ఫహద్‌ పన్ను చెల్లించాడు. అమలాపాల్‌, సురేష్‌ గోపీలు మాత్రం అందుకు నిరాకరించడంతో వారిపై కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. సెలబ్రిటీలని కూడా చూడకుండా కేరళ సర్కార్ ప్రదర్శిస్తోన్న దూకుడుపై సామాన్యుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చివరి వరకు సర్కార్ ఇదే టెంపోను మైంటైన్ చేస్తుందో లేదో చూడాలి.