Amabti Rambabu comments on tdp          అదేదో సినిమాలో విలన్‌ పక్కన్ ఉండే కమెడియన్, “నువ్వో దౌర్భాగ్యుడివి.. నువ్వో దుష్ట దుర్మార్గుడివి… నువ్వో రాక్షసుడివి…నువ్వో నీచ మీకృష్టుడివి…” అంటూ నోటికొచ్చినట్లు తిట్లు తిట్టేసి… “అని ప్రజలు అనుకొంటున్నారు…” అంటూ ముగిస్తుంటాడు. రాష్ట్ర సాగునీటి శాఖా మంత్రి అంబటి రాంబాబు సాక్షీ మీట్‌ చూసినప్పుడు కూడా సరిగ్గా అటువంటి భావనే కలుగుతుంది.

టిడిపి బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు, టిడిపి, జనసేనల పొత్తులు తదితర అంశాల గురించి సుమారు గంతకుపైగా ఆయన ఈరోజు ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. మంత్రి పదవి చేపట్టగానే డయాఫ్రాం వాల్వ్ గురించి ఏదో మాట్లాడేసి నవ్వుల పాలైన ఆయన ఇవాళ్ళ దాని గురించి కాగితాలను ఎదురుగా పెట్టుకొని గట్టిగా మాట్లాడటం విశేషం. ఆనాడు టిడిపి చేసిన తప్పు వలననే డయాఫ్రాం వాల్వ్ దెబ్బతిందని గట్టిగా చెప్పారు.

ఈ మూడేళ్ళలో జగనన్న పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని, ప్రజలు జై జగన్ అంటుంటే, చంద్రబాబు నాయుడు మా రాక్షస ప్రభుత్వాన్ని, మా రాక్షస పాలనను అంతం చేస్తానంటున్నారు. మా జగనన్నని సంఘవిద్రోహ శక్తి అంటున్నారు. చంద్రబాబు నాయుడు క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్‌ అంటున్నారు. మా జగనన్న సొంత బాబాయ్‌నే హత్య చేయించారని అసత్య ఆరోపణలు చేస్తున్నారు.

తాను కట్టించిన మరుగుదొడ్లను సైతం మా ప్రభుత్వం విడిచిపెట్టకుండా వాటిపై కూడా పన్నులు వేస్తోందని, చెత్తపన్నులు వేస్తోందని, ఇలా అన్నిటిపై విపరీతమైన పన్నులు వేస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు.

ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు… అప్పులు పుట్టకూడదు… అద్భుతంగా అమలవుతున్న నవరత్నాలు, సంక్షేమ పధకాలు అమలుకాకూడదని చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కలిసి కుట్రలు చేస్తున్నాయి.

అత్యంత ప్రజాదారణ కలిగిన మా జగనన్నను చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎదుర్కోలేకనే మళ్ళీ పవన్ కళ్యాణ్‌తో పొత్తులకి సిద్దం అవుతున్నారు. కానీ మీరెంతమంది కలిసి వచ్చినా మా జగనన్నను ఓడించడం ఎవరి తరం కాదు. కావాలంటే ఇప్పుడే రాసిపెట్టుకోండి,” అని అంబటి ముగించారు.

ఆయన ఉద్దేశ్యం తమ జగనన్నను, తమ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్ధించుకొంటూ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, టిడిపి, జనసేనలను ధీటుగా ఎదుర్కోవడమే. కానీ ప్రతిపక్షాలు తమ అధినేత, ప్రభుత్వం గురించి అన్నమాటలను ప్రెస్‌మీట్‌లో యధాతధంగా గట్టిగా చెప్పుకోవడంతో చూసేవారికి ఆ సినిమా సన్నివేశమే తప్పక గుర్తుకు వస్తుంది.