తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఇదివరకు ఏపీలో రోడ్ల పరిస్థితి, నీళ్ళు, విద్యుత్ కొరతపై చేసిన వ్యాఖ్యలతో వైసీపీ మంత్రులకు రోషం పొడుచుకువచ్చి ప్రతివిమర్శలు చేశారు. ఆ గొడవ క్రమంగా చల్లారిపోయింది. మంత్రి కేటీఆర్ మళ్ళీ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి మన ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి చేసినట్లే ఉన్నాయి.
ఆస్ట్రియాకు చెందిన ఆల్ఫ్రా కంపెనీ సంగారెడ్డి జిల్లా మైలపాశారంలో రూ.500 కోట్లు పెట్టుబడితో ఓ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దానిలో కొత్తగా ఏర్పాటు చేసిన మౌల్డింగ్ యూనిట్, డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్లను మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణలో భారీ పెట్టుబడులతో, దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి తరలివస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు ‘పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కూడా ఉంది కనుక. మా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అవసరమైన సదుపాయాలు కల్పించి, వారికి ప్రోత్సాహాకాలు అందిస్తుందే తప్ప ఏనాడూ వారిని వేధించదు,” అని అన్నారు.
మంత్రి కేటీఆర్ వైసీపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకపోయినా ఆయన దానిని ఉద్దేశ్యించే ఈ మాటలు అన్నారని అర్దమవుతూనే ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు వైసీపీ వేధింపులకు భయపడి మూసుకోలేక, అలాగని నడిపించుకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.
చంద్రబాబు నాయుడుకి చెందిన హెరిటేజ్ కంపెనీ, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన చిత్తూరులోని అమర్ రాజా కంపెనీ, టిడిపి నేత ధూళిపాళ నరేంద్ర అధ్వర్యంలో నడుస్తున్న సంగం డైరీలు ఇటువంటి వేధింపులను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నాయి.
రాష్ట్రంలో ఇంకా అనేక పరిశ్రమలకు ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో పరిశ్రమకు ఒక్కో రకం ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. వాటితోనే సతమతమవుతున్న ఆ పరిశ్రమలకు వైసీపీ ప్రభుత్వం లేదా వైసీపీ నేతల వేధింపులు భరించక తప్పడం లేదు. చివరికి సినీ పరిశ్రమకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. ఇవన్నీ గమనించే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈవిదంగా అని ఉండవచ్చు.