Allu Sirish tweets on BJPమెగా వారసత్వం క్రింద టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ వ్యాఖ్యలు చాలా సందర్భాలలో వివాదాస్పదం కావడంతో… ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. అలాంటి అల్లు శిరీష్ సోషల్ మీడియాలో తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు అల్లు శిరీష్.

‘పెద్ద నోట్ల రద్దు కారణంగా కష్టాలు ఎదురైనా, ప్రజలు దానిని సమర్థిస్తున్నారు. దీని అమలులో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఆపత్కాలంలో మనం ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి’ అంటూ చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుండి మాంచి స్పందన వచ్చింది. ‘మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు సర్‌?’ అంటూ అభిమానులు ప్రశ్నించడంతో…. ఈ అల్లు వారబ్బాయి మళ్ళీ దానికి బదులు ఇచ్చుకోవాల్సి వచ్చింది.

‘నేను రాజకీయ వ్యవస్థలో ఇప్పటికే భాగస్వామిని అయ్యాను. ఓటరుగా..! అధికారం, పదవుల వాంఛ నాకు లేదు. కృతజ్ఞతలు’ అంటూ జవాబు ఇవ్వడంతో అవాక్కవ్వడం సదరు అభిమాని వంతయ్యింది. అయితే మోడీపై తనకున్న అభిమానాన్ని, తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల తన అభిప్రాయాన్ని అల్లు శిరీష్ పరోక్షంగా ఈ విధంగా వ్యక్తపరిచాడనే చెప్పాలి.