Allu arvind files case on raabta movieటాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసుకుంటూ బడా నిర్మాతగా, ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తిగా చలామణి అవుతోన్న అల్లు అరవింద్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెట్లు ఎక్కారు. నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ ఉన్నట్లుండి కోర్టు మెట్లు ఎక్కడానికి కారణమేంటో తెలుసా..? రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన “మగధీర” సినిమానే..!

చెర్రీ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమా టాలీవుడ్ ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో రీమేక్ చేయాలన్న ఆలోచనలు అప్పట్లో వచ్చాయి గానీ, అవి కార్యరూపం దాల్చలేదు. కానీ ఈ సినిమా హక్కులు తీసుకోకుండా ‘ఫ్రీమేక్’ రూపంలో సుశాంత్ సింగ్, కృతిసనన్ జంటగా ‘రాబ్తా’ అనే సినిమా బాలీవుడ్ లో విడుదలకు సిద్ధం కానుండడంతో అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కక తప్పలేదు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ “మగధీర” రీమేక్ అన్న విషయం దాదాపుగా ఖరారు చేసింది. అయితే ‘మగధీర’ హక్కులను తీసుకోకుండా ఈ సినిమాను నిర్మించారంటూ ఆరోపిస్తూ… విడుదలను నిలిపివేయాల్సిందిగా అల్లు అరవింద్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును సంప్రదించారు. జూన్ 9న ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకోగా, అరవింద్ వేసిన పిటిషన్ జూన్ 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. దీంతో ఈ లోపున విషయం సెటిల్మెంట్ అవుతుందా? లేక “రాబ్తా” విడుదలకు బ్రేక్ పడుతుందా అనేది వేచిచూడాలి.