Allu Arjun Serves A Feast To Trolls & Doubts To Fansస్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ “పుష్ప” సినిమా అప్ డేట్స్ ను చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన నాలుగవ పాటను, తదుపరి సినిమా ట్రైలర్ ను, 5వ పాటను చివరగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ… నాలుగవ పాటకు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

‘ఏయ్ బిడ్డా… ఇది నా అడ్డా…’ అంటూ కుర్చీలో కూర్చున్న అల్లు అర్జున్ లుక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కు గురవుతోంది. నిజానికి సునీల్ పోస్టర్ రిలీజ్ అయిన నాటి నుండి “పుష్ప”పై ఉన్న అంచనాలు తారుమారై, తర్వాత రిలీజ్ అయిన అనసూయ పోస్టర్, నేడు బన్నీ పోస్టర్ దీనికి ఊతమిచ్చే విధంగా ఉండడంతో ‘పుష్ప’ నెటిజన్లకు పౌష్టిక ఆహారంలా మారింది.

“రంగస్థలం”ను మించిపోయే విధంగా “పుష్ప” ఉండాలని సుకుమార్ చేస్తోన్న ప్రయత్నాలు, ఆయా క్యారెక్టర్స్ కు సూట్ అయినట్లుగా వుండకపోవడమే ఈ ట్రోల్స్ కు ప్రధాన కారణంగా విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రోల్స్ నాటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా “శక్తి” అనుభూతులను జ్ఞప్తికి తీసుకువస్తోంది.

“మగధీర” సినిమాను అధిగమించాలని చేసిన ‘శక్తి’ జూనియర్ ఎన్టీఆర్ గెటప్ పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధికంగా ట్రోల్స్ ను ఎదుర్కొన్న ‘శక్తి’ సినిమాతో జూనియర్ ను ‘ఏ1 స్టార్’గా కీర్తించగా, నేడు ‘పుష్ప’తో బన్నీ ‘ఐకాన్ స్టార్’గా అవతరించారు. ‘రంగస్థలం’ టార్గెట్ గా రూపుదిద్దుకుంటున్న “పుష్ప” నాటి ‘శక్తి’ రిజల్ట్ ను మాత్రం రిపీట్ చేయకూడదనేది అభిమానుల ఆశ.