allu-arjun-stand-on-pawan-kalyan-janasena-partyమే 4వ తేదీన “నా పేరు సూర్య” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న అల్లు అర్జున్, తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. టాలీవుడ్ ట్రెండ్ మారుతోందని, ప్రస్తుతం హీరోలందరూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారని, ‘రంగస్థలం’ ద్వారా ఇప్పటికే రామ్ చరణ్ సూపర్ సక్సెస్ అందుకున్నాడని, అలాగే ‘భరత్ అనే నేను’ ద్వారా మహేష్ బాబు కూడా సరికొత్తగా రాబోతున్నారని, ‘నా పేరు సూర్య’ కూడా అలాగే ఉండబోతోందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

ఇక ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్ పై స్పందించిన బన్నీ, ఈ ఇంటర్వ్యూలో ‘జనసేన’పై కూడా తన స్టాండ్ ను స్పష్టంగా చెప్పారు. “తన పయనం ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి వెనుకేనని, ఆయన ఏ దారిలో నడిస్తే తనది అదే దారని చెప్పిన బన్నీ, ఒకవేళ చిరంజీవి జనసేన జెండా పట్టుకుంటే, తాను కూడా జనసేన జెండా పట్టుకుంటానని, తనకంటూ ప్రత్యేక విధివిధానాలు ఏమీ లేవంటూ” ఒక స్పష్టమైన ప్రకటన చేసి, రాబోయే ఎన్నికలలో పుకార్లకు తెరలేపకుండా చేసాడు. అంటే ‘జనసేన’పై బన్నీ ప్రస్తుత స్టాండ్ ఏమిటో ఫ్యాన్స్ కు అర్ధమయ్యే విధంగా చెప్పినట్లే కదా!

మరి రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి, రాబోయే ఎన్నికలలో ఏపీలో పర్యటనలు చేస్తే అల్లు అర్జున్ కూడా చిరు పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం ఇప్పుడే లభించాలంటే హీనపక్షంగా మరో ఏడెనిమిది మాసాలు అయినా వేచిచూడాల్సిందే. అప్పటికి గానీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కి, సమీకరణాలు పూర్తిగా మారే అవకాశాలు లేవు. ఈ లోపున పవన్ ‘జనసేన’ పయనం ఎటు వైపో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.