ఇది సుక్కు "పుష్ప" కాదు, బన్నీ "పుష్ప"‘ఆర్య, ఆర్య 2’ తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు “పుష్ప” సినిమా వచ్చేసింది. అనేక అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షం అయిన “పుష్ప” సినిమాను చూసి ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? అన్న ఆసక్తి నెలకొనడం సహజం. మరి ‘పుష్ప’పై ఏర్పడిన భారీ అంచనాలను అందుకుందా? అంటే… అంతకంటే ముందు కొన్ని విషయాలు ప్రస్తావించాల్సి ఉంటుంది.

సుకుమార్ సినిమా అంటే ఎలా ఉంటుంది? “1 నేనొక్కడినే”లా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు… హీరో, విలన్, హీరోయిన్ ఇలా క్యారెక్టర్స్ లో ట్విస్టులు! అలాగే “నాన్నకు ప్రేమతో” ఫైట్ సీన్స్ లో కూడా లెక్కల మాస్టర్ తన లెక్కలకు పదును పెడుతూ యాంగిల్స్ ను వివరించడం… విలన్ చేతిలో మూడు గోళీలు పెట్టి అత్యున్నత తెలివి తేటలను ప్రదర్శించడం… ఇలా అద్భుతమైన ట్విస్ట్ లతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు.

ఆ తర్వాత వచ్చిన “రంగస్థలం”లో ఇన్ని ట్విస్ట్ లు కాకపోయినా, అప్పటివరకు మంచిగా చూపించిన ప్రకాష్ రాజ్ ను విలన్ ను చేయడం, అలాగే చెవుడు ఉన్న హీరోతో అమోఘమైన హీరోయిజాన్ని పండించడం… ప్రతి క్యారెక్టర్ కు గుర్తింపు వచ్చేలా కధను డిజైన్ చేయడం… ఇలా తనలోని మార్పును సూచించే విధంగా “రంగస్థలం”ను తీర్చిదిద్ది ప్రేక్షకులకు అందించారు.

ఇక ప్రస్తుత “పుష్ప” సినిమాకు వస్తే ‘1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ మాదిరి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉండవు. ఇంకా చెప్పాలంటే అసలు ట్విస్ట్ లే ఉండవు. ‘రంగస్థలం’ మాదిరి హై వోల్టేజ్ హీరోయిజం కూడా ఉండదు. మరి అవేమి లేకుండా “పుష్ప”ను ఎలా తీసుకువచ్చారు? అంటే అదే సుక్కు మ్యాజిక్. ఈ సినిమాలో సుక్కు తెలివితేటల కంటే సుకుమార్ ‘కలం’ బాగా పనిచేసే విధంగా హీరో క్యారెక్టర్ ను డిజైన్ చేసారు.

అందుకే “పుష్ప” సుకుమార్ సినిమాలా ఉండదు, కంప్లీట్ “వన్ మ్యాన్ షో” మాదిరి అల్లు అర్జున్ “పుష్ప”ను ఓ స్థాయిలో తన నటనతో పండించేసారు. గూని గెటప్ లో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, స్లాంగ్ గానీ… ఇలా ప్రతి విషయంలో పుష్ప రాజ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ జీవించేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే 2021 బెస్ట్ హీరో క్యాటగిరీలో అవార్డులన్నీ తన సొంతం చేసుకునేలా అల్లు అర్జున్ ప్రేక్షకులను మెప్పిస్తాడు.

అంతే… ‘పుష్ప’ గురించి మాట్లాడాలంటే ఒక్క అల్లు అర్జున్ మరియు ఆ క్యారెక్టర్ ను అంత బాగా రచించిన సుకుమార్ రైటింగ్. మిగిలిన క్యారెక్టర్స్ లో విలన్ గా సునీల్ ను సరికొత్తగా చూపించడంలో సక్సెస్ అయిన సుకుమార్, మిగిలిన పాత్రలన్నీ పేలవంగా ముగించడం మైనస్ గా మారింది. ఎంతో హైప్ తీసుకువచ్చిన ఫాహిద్ ఫాజిల్ క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుండి క్లైమాక్స్ వరకు సుక్కు మరోలా ఆలోచించి ఉంటే “పుష్ప 2″పై భారీ అంచనాలు ఏర్పడేవి . కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా క్లైమాక్స్ టాక్ ఉంది.